26-10-2025 08:29:50 PM
జేఏసీ నాయకులు డి.తిరుపతి..
రేగొండ (విజయక్రాంతి): పాండవుల గుట్ట అభివృద్ధి శూన్యమని కేయు పరిశోధన విద్యార్థులు, జేఏసీ నాయకులు డి.తిరుపతి అన్నారు. ఆదివారం ఆయన కేయూ పరిశోధన విద్యార్థులతో కలిసి మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో ఉన్న పాండవుల గుట్టలను సందర్శించి మాట్లాడారు. చారిత్రక చరిత్ర కలిగిన పాండవుల గుట్టలను అభివృద్ధి పేరుతో రెండుసార్లు శంకుస్థాపన చేసి నాయకులు చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పాండవుల గుట్ట అభివృద్ధి శూన్యమని గుట్టకు వెళ్లడానికి కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదని అన్నారు.
భూపాలపల్లి జిల్లాలో పర్యాటక కేంద్రాలు చరిత్ర కలిగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని స్థానిక నాయకులు వెంటనే అభివృద్ధికి అడుగులు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాండవుల గుట్టను కేటాయించిన నిధులతో తక్షణమే అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తయారు చేయాలని అన్నారు. పాండవుల గుట్టలో కనీస వసతులు లేవని ప్రభుత్వ అధికారులు స్పందించి పర్యాటకులకు కనీస అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కేయూ పరిశోధక విద్యార్థులు, జేఏసీ నాయకులు, మాదాసి రమేష్, కేశపాక ప్రసాద్, కందికొండ తిరుపతి, పిఎస్ఎఫ్ఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్ లు ఉన్నారు.