26-10-2025 08:45:42 PM
నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా.. నీ మాటలు నమ్మే రోజులు పోయాయి..
తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబుపై నీ ఏడుపుగొట్టు ఇంకెన్నాళ్లు..
నేనొక్కడినే వస్తా... నీవు చేసిన ఆరోపణలు రుజువు చేస్తావా...?
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు బహిరంగ సవాల్ విసిరిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్..
గోదావరిఖని (విజయక్రాంతి): పుట్ట మధు.. నీ చరిత్ర తెలియనిది ఎవరికి.. నువ్వు నిజాయితీగా ఉంటే.. మంథని నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎందుకు ఓడిస్తున్నారు.. బీసీ బహుజనలు అనే సెంటిమెంటుతో నువ్వు ఎన్ని కుయుక్తులు పన్నిన... ప్రజలు నీ మాటలు నమ్మేస్థితిలో లేరు.. మంథని నియోజకవర్గ ప్రజలు, మీడియా మిత్రులు నీ మాటలు నమ్మడం లేదని హైదరాబాద్ కు వెళ్లి ప్రెస్ మీట్ లు పెట్టడం కాదు.. నేనొక్కడినే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా.. నీవు చేసిన ఆరోపణలు రుజువు చేస్తావా...? అంటూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కు రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ బహిరంగ సవాల్ విసిరారు.
ఈ మేరకు ఆదివారం గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మంత్రి శ్రీధర్ బాబు క్యాంపు ఆఫీసులో కోటి 17 లక్షలు స్కామ్ జరిగిందని ఆరోపణలు చేసిన నీకు అదే మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్ డి ఆయన సంతకంను ఫోర్జరీ చేశారని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. మీ నాయకుడు కేసీఆర్ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయమని మీకేమైనా శిక్షణ ఇచ్చారా అని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు కార్యాలయం అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటుందని అనడం హాస్యాస్పదమని, తనను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఆయన కలిసేందుకు వస్తుంటే తెల్లారేసరికి కూడా అందరి సాధక బాధలు విని పరిష్కరిస్తున్నారని, అదే మీ నాయకుడు 10 ఏళ్లలో కనీసం మిమ్మల్ని కూడా గేటు లోపలికి రానీయలేదని, అది మీకు మా నాయకునికి ఉన్న తేడా అని పేర్కొన్నారు.
ఎల్లకాలం మంత్రి శ్రీధర్ బాబు కుటుంబంపైనే నీ ఏడుపుగొట్టు ఇకనైనా మానుకోవాలని.. నువ్వు చేసిన ఆరోపణలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. మంత్రి శ్రీధర్ బాబుపై బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. నేనొక్కడినే వస్తానని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను.. నీకు వచ్చే దమ్ము ఉందా.. నీవు చేసిన ఆరోపణలు రుజువు చేస్తావా? ఇదే నా సవాల్ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రామగుండం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు.