26-10-2025 08:38:14 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్న ఒక కూలి ప్రమాదవశాత్తు రాళ్ల కోత మిషన్ మీద పడటంతో మృతిచెందిన సంఘటన ఆదివారం గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు అందించిన వివరాల మేరకు కల్మల్ చెరువు గ్రామానికి చెందిన చల్ల తిరుపతిరావు(38) గ్రామం సమీపంలో ఉన్న బండరాతి గుట్టపై రాళ్లు కొట్టుకుంటూ, కరెంటు మిషన్ తో రాళ్ళని కోస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అయ్యప్ప స్వామి మాల ధరించి ఉన్న చలపతిరావు రోజు లాగే కూలి పనికి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆదివారం కూడా కరెంట్ మిషన్ తో రాళ్లను కోస్తూ ప్రమాదవశాత్తు ఆ మిషన్ చలపతిరావు కాలుపై పడి కాలు తెగిపోయింది. దీంతో ఈ విషయం తెలుసుకొని వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా తీవ్ర రక్తస్రావం జరిగి మార్గమధ్యలో చనిపోయినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తల్లి చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు.