16-11-2025 04:59:40 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. సంఘటనా వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం వెంకటరావుపేటకు చెందిన మల్లేశం కుటుంబం కొంతకాలంగా కరీంనగర్ లోని వావిలాలపల్లిలో ఉంటూ కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తోంది. మల్లేశంకు అశ్రిత్(17), అర్చన(16) అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. దివ్యాంగులైన వీరిద్దరూ శనివారం సాయంత్రం అపస్మారక స్థితిలో పడిపోయి ఉండగా తల్లి పోశవ్వ గమనించి ఆసుపత్రికి తరలించగా కూతురు అర్చన మరణించిందని వైద్యులు తెలిపారు.
అపస్మారకస్థితిలో ఉన్న అశ్రిత్ కు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే అశ్రిత్, అర్చనలను తండ్రి మల్లేశం గొంతు నులిమి చంపే ప్రయత్నం చేయగా వారిలో ఒకరు చనిపోగా, మరోకరు అపస్మారక స్థితిలో కొట్టుమిట్లాడుతున్నారని పేర్కొంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మల్లేశం కోసం గాలిస్తున్నామని కరీంనగర్ టౌన్ ఎసీపీ వెంకటస్వామి తెలిపారు. త్రీ టౌన్ సీఐ జాన్ రెడ్డి ఆద్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని అనుమానితుడిని విచారించినట్టయితే వాస్తవాలు తెలిసే అవకాశం ఉందన్నారు.