calender_icon.png 22 October, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పప్పు, నూనెగింజల సాగు పెంపు

22-10-2025 01:58:00 AM

-5,825 క్వింటాళ్ల శనగ విత్తనాలు పంపిణీ

-మొక్క జొన్న కొనుగోలుకు 204 సెంటర్లకు 100 సెంటర్లు ప్రారంభం 

-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి 

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : రాష్ర్టంలో వరితో పాటు పప్పు దినుసులు, నూనె గింజల సాగును పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా ఈ యాసంగిలో రూ.2.68 కోట్ల సబ్సిడీతో 49,397 ఎకరాలకు సరిపడా 5,825 క్వింటాళ్ల శనగ విత్తనాలను 14 జిల్లాలలో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు.

గతవారం పంపిణీ చేసిన వేరుశనగతో పాటు పొద్దుతిరుగుడు 83.78 క్వింటాళ్ల హైబ్రిడ్ విత్తనాలను, 74 క్వింటాళ్ల కుసుమ విత్తనాలను సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో రైతు నేస్తంలో పాల్గొన్న ఆయన జాతీయ ఆహార భద్రతా పథకం కింద నాణ్యమైన పప్పుదినుసు, పొద్దుతిరుగుడు, కుసుమ వంగడాలను సబ్సిడీ మీద రైతులకు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర, రాష్ర్ట వాటాలతో అమలు అయ్యే పథకాలన్నింటినీ ఒక్కొక్కటి పునరుద్ధరిస్తూ గరిష్ట స్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతువేదికల వద్ద రైతుల నుంచి సమీకరించి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు, రైతులకు లబ్ధి కలిగించే పూర్తి సమాచారాన్ని పక్కాగా అందించాల్సిన బాధ్యత డీఏవో, ఏవో, ఏఈవోలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన శాస్త్రవేతలను, వ్యవసాయ నిపుణలను ఆహ్వానించి, రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

పత్తి కొనుగోలు ప్రారంభం 

పత్తి కొనుగోలు ప్రారంభించినట్లు కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులు తమ  అనుకూలమైన సమయం చూసుకుని వారి పంటను అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా  రైతులు తమ ఫోన్ నెంబర్ ను అప్ డేట్ చేసుకునే వెసులుబాటును రాష్ర్టం లో సీసీఐ కల్పించిందన్నారు.

మద్దతు ధర ప్రకటించి మొక్కజొన్న పంటను కేంద్రం కొనకుండా వదిలేసిందని, రైతుల శ్రేయస్సు కోసం రాష్ర్ట ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నునట్లు చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం 204 సెంటర్లు ప్రతిపాదించగా, ఇందులో 100 సెంటర్లు ప్రారంభించామని, ఇందులో 30 సెంటర్ల ద్వారా 220 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేశామని, మిగతా సెంటర్లను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.