22-10-2025 10:42:55 PM
బెల్లంపల్లి, (విజయక్రాంతి): ఆన్లైన్ మోసాలు, మహిళల భద్రత అంశంపై బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినిలకు బుధవారం షీ టీం సభ్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై వివరించారు. యాంటీ డ్రగ్స్, ఎవరైనా చెడుగా మాట్లాడిన, ప్రవర్తించిన విద్యార్థులు తల్లిదండ్రులకు తెలపాలని సూచించారు. మహిళల భద్రత కోసం ప్రతిరోజు ప్రధాన చౌరస్తాలతో పాటు, జన సమీకరణ ప్రాంతాలు, కళాశాలలు, బస్టాండ్ లలో షీ టీం నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు భయపడవద్దని, 63039 23700 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని కోరారు.
వివరాలు అందించిన వ్యక్తుల సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. కొంతమంది అత్యాశకు పోయి సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలకు, లోన్ యాప్స్ మోసాలకు గురవుతున్నారని వీటి జోలికి పోవద్దని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలన్నారు. మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే వెంటనే 100 డయల్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు శ్రవణ్, దివ్య లతోపాటు విద్యార్థినీలు పాల్గొన్నారు.