15-08-2025 03:16:54 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): స్వాతంత్రం(Independence Day) వచ్చి 78 వసంతాలు పూర్తవుతున్న ఇంతవరకు స్వాతంత్ర ఫలాలు పేదలందరికీ చేరలేదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, పైంటర్స్ యూనియన్, కార్పైంటర్స్ యూనియన్, ఫుట్ పాత్ యూనియన్, వివిధ కూడళ్ళలో ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలినీ ఆయన కోరారు. దేశ స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించి బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా వ్యవహరించి త్రివర్ణ పతాకాన్ని క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు ఈరోజు దేశభక్తిని ప్రజలకు నేర్పించటం హాస్యాస్పదమన్నారు.
సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రకటించాలని పోరాడింది కమ్యూనిస్టులేననీ మీరట్ కుట్ర కేసు, పెషావర్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసులు బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టులపై బనాయించారన్నారు. కమ్యూనిస్టుల పోరాట చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని కుహనా దేశభక్తులు కమ్యూనిస్టులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. 1942లో క్విట్ ఇండియా తీర్మానం చేసినప్పుడు దానిని బహిరంగంగా వ్యతిరేకించిన ఆర్ ఎస్ ఎస్ ఇప్పుడు ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరాలని హడావుడి చేస్తుందన్నారు. బిజెపి మొదటి నుండి జాతీయ జెండాను గుర్తించడానికి నిరాకరించిందన్నారు. భారత రాజ్యాంగాన్ని కూడా ఆర్ఎస్ఎస్ విదేశీ రాజ్యాంగంగా పరిగణిస్తుందన్నారు.
మనుధర్మశాస్త్రమే మన దేశానికి రాజ్యాంగంగా ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ వైఖరి అన్నారు. మోడీ ప్రభుత్వ పాలనలో దేశ ప్రజా సంపదనంతా అదానీ, అంబానీలకి దోచిపెడుతూ దేశభక్తి నీతులు వల్లిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని అప్పనంగా కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ వారి ఆదాయాల పెరుగుదలకు మాత్రమే బిజెపి పని చేస్తుందన్నారు. క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమల్లి సాయిబాబు, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, సీపీఐ ప్రజాసంఘాల నాయకులు వీ పద్మజ, బి చెన్నయ్య, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు శనగారపు శ్రీనివాస్ నరహరి నాగేశ్వరరావు, ఇట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.