01-05-2025 12:00:00 AM
ఉగ్రదాడిపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం మానేసి భారత్‌తో పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వుతున్నది. పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాలమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాక్ సైన్యంతోపాటు ఆ దేశ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్‌ను మరింత రెచ్చ గొడుతున్నారు.
పాక్ రక్షణమంత్రి ఖవాజా మహమ్మద్ ఆసీఫ్ ఇటీవల స్థానిక మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్‌పై భారత్ సైన్యంతో దాడి చేసే అవకాశం ఉందని, అదే జరిగితే అణ్వాయుధాలను ఉపయోగించాల్సి వస్తుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తమపై రానున్న 24 గంటల్లో సైనిక చర్య చేపట్టేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోందంటూ ఆ దేశ సమాచార శాఖమంత్రి అతవుల్లా తరార్ అక్కసు వెళ్లగక్కారు.
పహల్గాం ఉగ్రదాడిపై స్పందించేందుకు భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన తర్వాత అతవుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు వెంబడి కొద్ది రోజులుగా కాల్పులు జరుపుతూ భారత సైన్యాన్ని కవ్విస్తోంది. తమ వైఫల్యాల నుంచి ప్రపంచం దృష్టి మరల్చడానికే పాక్ ఇదంతా చేస్తున్నట్టు పరిస్థితులనుబట్టి అర్థమవుతున్నది.
బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డ ఐదుగురు ముష్కరుల్లో అదిల్ హుస్సేన్ థాకేర్, అలీ భాయ్, హషిమ్ ముసా అనే ముగ్గురు పాకిస్థాన్ పౌరులుగా దర్యాప్తులో తేలింది. హషిమ్ ముసా గతంలో పాక్ సైన్యం ప్రత్యేక దళంలో కమాండో హోదాలో పని చేశాడని, ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ తీసుకోవడంతోపాటు పాక్ గడ్డమీద నుంచి తన కార్యకలాపాలను స్వేచ్ఛగా నిర్వర్తిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో అతడికి సంబంధాలు ఉన్నయనే విషయాలు దర్యాప్తులో వెల్లడయ్యాయి.
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్న వార్తలను గత కొన్నేళ్లుగా ఖండిస్తున్న పాక్ ఇప్పుడు ఆ విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకుంది. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘అమెరికా, బ్రిటన్‌సహా పశ్చిమ దేశాల కోసమే మూడు దశబ్దాలపాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం’ అన్నాడు.
ఆ దేశ మంత్రుల మాటలు, దర్యాప్తులో బయటపడ్డ విషయాలతో భారత్‌లో జరిగిన ఉగ్రదాడుల వెనుక పాకిస్థాన్ హస్తముందనే విషయం తేటతెల్లమైంది. అందువల్ల అంతర్గత వైఫల్యాలు, ఉగ్రదాడిలో తమ పాత్రనుంచి ప్రపంచం దృష్టిని మరల్చడంపై పాకిస్థాన్ ఇప్పుడు దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే పాక్ మంత్రులు, ఆ సైన్యం పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టు అర్థమవుతున్నది.
అయితే, పాక్ రెచ్చగొట్టినంత మాత్రాన రెచ్చిపోకుండా భారత్ చాలా పరిణతితో వ్యవహరిస్తూ సంయమనం పాటిస్తున్నది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సూపర్ క్యాబినెట్, భద్రతా వ్యవహారాల క్యాబినెట్, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, కేంద్ర క్యాబినెట్ సమావేశమైనాయి. పుల్వామా ఉగ్రదాడి తర్వాత సీసీపీఏ సమావేశం జరగడం ఇదే తొలిసారి. వీటిని పరిశీలిస్తే పాక్‌పై ఇప్పటికే దౌత్యపరంగా చర్యలు తీసుకున్న భారత ప్రభుత్వం ఉగ్రవాదులతోపాటు దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్టు అర్థమవుతున్నది.