calender_icon.png 1 May, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంప్రదాయ దుకాణాలు ఎక్కడ?

01-05-2025 12:00:00 AM

ఒకానొక కాలంలో సరుకుల కోసం పల్లెటూరులోగాని పట్టణంలోగాని ప్రతి వీధికో చిల్లరకొట్టు ఉండేవి. వీటిని సంప్రదాయ కుటుంబాలు ముఖ్యంగా వైశ్య కులస్తులు నిర్వహించే వారు. ఆ తరువాత ఉత్తర భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్‌ల నుంచి వలస వచ్చిన మార్వాడీ కులస్తులు కిరాణా వ్యాపారం నిర్వహించే వారు. ఇప్పటికీ హైదరాబాద్‌లోని బేగంబజార్‌లోని హెూల్‌సేల్ వ్యాపారం మొత్తం ఉత్తర భారత వ్యాపారస్తుల చేతిలో ఉంది.

ఈ చిల్లర వ్యాపారస్తులు వినియోగదారులను ఆకర్షించేందుకు మంచి గా, మర్యాదగా మాట్లాడుతూ బేరసారాలు నిర్వహించి లాభం గడించేవారు. వినియోగదారులతో స్నేహం పెంచుకొని ఇంట్లో జరిగే శుభకార్యాలలో సైతం పాల్గొంటూ వ్యక్తిగతంగా వినియోగదారునికి దగ్గరయ్యే వారు. ఈ విధంగా సంప్రదాయబద్ధంగా జీవనం కొనసాగించారు.

గత కొన్నేళ్లుగా మనిషి ఆధునిక జీవనానికి అలవాటు పడి నగరాల్లో చివరకు మండల కేంద్రాల్లో కూడా కార్పొరేట్ శక్తులు నెలకొల్పిన మాల్స్, మార్ట్‌లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ మాల్స్ నిర్వాహకులు భారీ ఎత్తున పలు అంతస్తుల భవనాలలో రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించి ప్యాకింగ్ సరుకులు అమ్ముతుంటారు.

వీరు ప్రకటించే ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్, ఒకటి కొంటె మరొకటి ఉచితం వంటి వాటి ఆకర్షణతో వినియోగదారులు అటువైపు మళ్లుతున్నారు. ఈ మాల్స్, మార్ట్‌లలో మనకు అవసరమైన తూకం సరుకు లేక వారు ప్యాక్ చేసిన సరుకులు కొనడం సర్వసాధారణమైంది. సంప్రదాయ తూకాలకు బదులు (ఉదా॥కు పావు కిలో స్థానంలో 200 గ్రా. ప్యాకెట్) తక్కువో, ఎక్కువో ప్యాకెట్లు ఉంంటాయి.

మరలా మరలా రావాలని మాల్స్ నిర్వాహకులు చేసే మాయాజాలంగా దీనిని భావించాలి. అదే చిల్లరకొట్టుకు వెళ్ళితే తనకు అవసరమైన మేరకే కొని ఆదాయం పొదుపు చేసుకోగలరు. మాల్స్, మార్ట్‌లోకి వెళ్లాలంటే జేబులో నగదు కానీ, బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా డిజిటల్ పేమెంట్ యాప్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ఏదో ఒకటి తప్పక ఉండవలసిందే.

ఉద్దెర అన్నదే ఉండదు. దినసరి వేతన కూలీలకు తమ జీవన విధానానికి ఈ చిల్లర దుకాణాలు అనుకూలంగా ఉండేవి. చిన్న దుకాణం ఒక వారసత్వంగా కొనసాగాల్సిన రోజులు మళ్లీ వచ్చేనా అంటే సందేహమే.

 ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్