27-10-2025 01:09:01 AM
22వ భారత్ ఆసియాన్ సదస్సుకు వర్చువల్‌గా హాజరు
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ప్రస్తుతం అనిశ్చితి ఉన్నప్పటికీ వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్ ఆగ్నేయాసియా దేశాలు స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మలేషియా రాజధా ని కౌలాలంపూర్ వేదికగా ఆదివారం నిర్వహించిన ‘22వ భారత్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) -సదస్సులో ఆయన వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు.
చరిత్ర, సంస్కృతి, నాగరికతపరంగా భారత్, ఆగ్నేయాసియా సమాఖ్య మధ్య లోతైన బంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రపంచ జనాభాలో ఒక్క భూభాగంలోనే నాలుగో వంతు జనాభా ఉందని తెలిపారు. భారతదేశం ఎప్పుడూ ఆగ్నేయాసియా దేశాలకు అండగా నిలబడిందని, ఆయా దేశాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణం స్పం దించిందని గుర్తుచేశారు. బ్లూ ఎకానమీ, సముద్ర భద్రత వంటి అంశాల్లో భారత్ సహాయ, సహకారాలు ఉంటాయని భరోసానిచ్చారు.
2026 సంవత్సరం భారత్ ఆగ్నేయాసియా సహకర సంవత్సరమని ప్రకటించారు. భారత్ ఇప్పటికే తూర్పు దేశాలతో చురుకైన సంబంధాలు కొనసాగిస్తున్నాదని ఉద్ఘాటించారు. ఆసియా కేంద్రిత నిర్ణయాలతోపాటు ఇండో ఆసి యా దేశాల ఐక్యతకు భారత్ ఎప్పుడూ సం పూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
విద్య, పర్యాటకం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, గ్రీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో పరస్పర సహకారాలు కోరుతున్నామని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం కు అభినందనలు తెలిపారు. తర్వాత ఆయన థాయ్‌లాండ్ రాజ మాత సిరికిత్ (93) మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె థాయ్‌లాండ్ ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.