27-10-2025 01:44:35 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో(Telangana) వర్ష సూచనల దృష్ట్యా పంటల కొనుగోళ్లపై(Crop purchases) అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ధాన్యం, పత్తి, మొక్కజోన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు నష్టం జరగకుండా, ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సాయంత్రం కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 'మొంథా తుఫాన్' తుఫాను దృష్ట్యా, భారత వాతావరణ శాఖ (India Meteorological Department) రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.
సోమవారం ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్‌కూల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తుఫాను కారణంగా తెలంగాణలోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను వణికిస్తోంది. కాకినాడ, విశాఖపట్నం సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, రేపు సాయంత్రానికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.