27-10-2025 02:09:49 PM
ఆటో డ్రైవర్లకు మద్దతుగా హరీష్ రావు
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలని అమలు చేయాలి
హైదరాబాద్: ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకునేందుకు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి హరీష్ రావు(MLA Harish Rao) గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్(Telangana Bhavan) వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేసిందని ఆటో డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి కిరాయిలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కిస్తీలు కట్టలేక అప్పుల భాదతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఆటో డ్రైవర్ తెలిపారు. వేలాది మంది ఆటో రిక్షా డ్రైవర్ల దుస్థితిని పరిష్కరించకుండా మళ్లీ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టవద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని హరీష్ రావు హెచ్చరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా, ప్రతి డ్రైవర్‌కు చెల్లించాల్సిన రూ.24,000ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. "రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఆటోల్లో ప్రయాణించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని వదిలేశారు. ఆయన మళ్ళీ హైదరాబాద్ వస్తే, మా ఆటో డ్రైవర్లు శంషాబాద్‌లో ఆయనను అడ్డుకుంటారు" అని హరీశ్ రావు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ అంతటా బీఆర్ఎస్ నిరసన ప్రదర్శన చేపట్టింది. నాయకులు ఆటోలలో ప్రయాణించి డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హరీష్ రావు కోకాపేటలోని తన నివాసం నుండి ఎర్రగడ్డకు, ఆపై తెలంగాణ భవన్‌కు ప్రయాణించి డ్రైవర్లతో వారి కష్టాలను గురించి సంభాషించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు సహా సమాజంలోని అన్ని వర్గాలకు ద్రోహం చేస్తోందని హరీశ్ రావు అన్నారు. "సంవత్సరానికి రూ. 12,000 సహాయం, ఆటో నగర్, ఆటో వెల్ఫేర్ బోర్డు వాగ్దానాలు ఖాళీ నినాదాలుగా మారాయి. రెండేళ్లలో డ్రైవర్లకు ఒక్క రూపాయి కూడా చేరలేదు" అని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన ఏడాదికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో డ్రైవర్లకు 15వేలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదన్న హరీశ్ రావు హామీల అమలు పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ది రేవంత్ రెడ్డికి లేదా? అని ప్రశ్నించారు.