27-10-2025 02:33:41 PM
15 గొర్రెలు మృతి.
కౌడిపల్లి–కొల్చారం రోడ్డుపై సంఘటన.
బోరున విలపించిన యజమాని.
కొల్చారం: ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చే అదుపుతప్పి రోడ్డుపై ఉన్న గొర్రెల మంద పైకి దూసుకెల్లడంతో సుమారు 15 గొర్రెలు మృత్యువాత పడ్డ సంఘటన మెదక్ జిల్లా కొల్చారం - మెదక్ ప్రధాన రహదారిపై సోమవారం జరిగింది. నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్లి కౌడిపల్లి కొల్చారం మధ్యలో గల లోతువాగు ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపి దిగిపోగా సంఘటనా స్థలంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. రోడ్డు మధ్యలో మృత గొర్రెలు, గాయపడినవి పడి ఉండటంతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది. ప్రయాణికులు, స్థానికులు సంఘటన చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న కొల్చారం పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతి చెందిన గొర్రెల యజమాని ఆ దృశ్యం చూసి బోరున విలపించాడు. స్థానికులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తరచుగా గొర్రెల మందలు రోడ్డుపై వెళ్తుంటాయని, వాహనదారులు వేగం నియంత్రించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.