04-09-2025 01:26:05 AM
భారత్ ‘నో డ్యూటీ’ ఆఫర్ ఇచ్చిందని పునరావృతం చేసిన ట్రంప్
వాషింగ్టన్, సెప్టెంబర్ 3: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్‌పై విషం కక్కారు. భారత్ అత్యధికంగా సుంకాలు విధించే దేశం అని ఉద్ఘాటించారు. సుంకాల నుంచి తమకు మినహాయింపు ఇస్తామని భారత్ ప్రతిపాదించిందని మరోసారి ఆరోపించారు. బ్రెజిల్, చైనా లాగే భారత్ కూడా అమెరికాను సుంకాలతో చంపేస్తోందన్నారు. స్కాట్ జెన్నింగ్స్ రేడియో షోలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘చైనా అమెరికాను సుంకాలతో చంపేస్తోంది. భారత్ కూడా అలాగే చేస్తోంది. బ్రెజిల్‌ది కూడా అదే దారి. ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువగా సుంకాలను నేనే అర్థం చేసుకున్నా. ప్రపంచంలో ఎక్కువ సుంకాలు విధించే దేశాల జాబితాలో భారత్ తొలిస్థానంలో ఉంది.
నేను చేపట్టిన చర్యలతో ఆయా దేశాలు దిగివస్తున్నాయి. వారు సుంకాలను ఎత్తేస్తామని ఆఫర్ చేశారు. నో టారిఫ్స్..ఆర్థికంగా మరింత బలపడదాం’ అని పేర్కొన్నారు. ట్రంప్ ఇది వరకు కూడా భారత్ సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రతిపాదించిందని వ్యాఖ్యానించారు.