calender_icon.png 20 January, 2026 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ బౌలింగ్‌తో కష్టమే

20-01-2026 12:00:00 AM

బుమ్రా లేకుంటే అంతేనా

తేలిపోతున్న భారత బౌలర్లు

కివీస్‌తో సిరీస్‌లో ఫ్లాప్ షో

పదును తగ్గిన పేస్

మ్యాజిక్ చూపని స్పిన్నర్లు

క్రికెట్‌లో ఏ జట్టయినా ఏ ఒక్క విభాగంలోనూ రాణిస్తే సరిపోదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ సత్తా చాటాలి. అన్నింటిలో అదరగొడితేనే విజయాలు వెంట వస్తాయి. ఏదో ఒక విభాగంలో రాణించి, మిగిలిన వాటిలో చేతులెత్తేస్తే ఓటములే పలకరిస్తుంటాయి. ప్రస్తుతం టీమిండియాకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. బ్యాటింగ్‌లో రాణిస్తున్నా, బౌలింగ్‌లో మాత్రం చాలా ఇబ్బందులున్నాయి.తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ దీనికి అసలైన ఉదాహరణ. మన బౌలింగ్ ఇలాగే ఉంటే మాత్రం కష్టమే.

ఇండోర్, జనవరి 19 : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఓడిపోవడం భారత్‌కు మేలే చేసింది. మన బౌలింగ్‌లోని బలహీనతలను ఈ సిరీస్ పూర్తిగా బయటపెట్టింది. పేసర్లు, స్పిన్నర్లు పోటాపోటీగా విఫలమయ్యారు. అది కూడా సొంతగడ్డపై మన బౌలర్లు ఇలాంటి చెత్త ప్రదర్శన కనబరచడం ఆశ్చర్యపరుస్తోంది.తొలి వన్డేలో భారత్ గెలిచినా కూడా భారత బౌలర్లు చెప్పుకోదగిన ప్రదర్శన కనబరచలేదు. ఇక మిగిలిన రెండు వన్డేల్లో మన బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకంటే పటిష్టంగా అయితే లేని న్యూజిలాండ్‌పై ఇలాంటి బౌలింగ్ ఒక విధంగా అవమానంగానే చెప్పాలి. 

రెండో వన్డేలో మన బౌలర్లు అస్సలు ప్రభావం చూపలేకపోయారు. పవర్ ప్లేలో రెండు వికెట్లు తీసారని సంబరపడే లోపే మిడిల్ ఓవర్లు, స్లాగ్ ఓవర్లలో చేతులెత్తేశారు. ఫలితంగా కివీస్ సిరీస్‌ను సమం చేసేసింది. రెండో వన్డేలో డారిల్ మిచెల్, విల్ యంగ్‌ను భారత బౌలర్లు ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. ఒక దశలో మన బౌలింగ్ సాదాసీదా జట్టులా కనిపించిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్ చేసారంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో వన్డేలోనూ ఇదే పరిస్థితి. ఆరంభంలో వికెట్లు తీసి తర్వాత చేతులెత్తేశారు. అటు పేసర్లు , ఇటు స్పిన్న ర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మిచెల్, ఫిలి ప్స్ ఆద్యంతం మన బౌలింగ్‌పై పూర్తి ఆధిప త్యం కనబరిచారు.

బుమ్రా లేకపోవడం మన పేస్ ఎటాక్ బలహీనంగా మారిపో యింది. అయితే గతంలోనూ బుమ్రా లేనప్పుడు పలువురు పేస ర్లు రాణించిన విషయాన్ని మరిచిపోకూడదు. కానీ ఆ పేస్‌లో పదు ను ఇప్పుడు కనిపించడం లేదు. చాలా రోజుల తర్వాత వన్డే జట్టులోకి రీఎం ట్రీ ఇచ్చిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్  అనుకున్న స్థాయిలో రాణించలేదు. చివరి వన్డేలో పొదుపుగా బౌలింగ్ చేసినా తన స్థాయికి తగినట్టు వికెట్లు పడగొట్టలేకపోయాడు. ఓవరాల్‌గా చూస్తే సిరాజ్ పేస్ పదు ను మాత్రం తగ్గిందని చెప్పొచ్చు. అటు అర్షదీప్‌సింగ్‌కు చివరి వన్డేలో మాత్రమే అవకా శం దక్కింది. అర్షదీప్ 3 వికెట్లు తీసినా భారీ గా పరుగులిచ్చాడు. ఇక ప్రతీసారీ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న ప్రసిద్ధ కృష్ణ కివీస్‌పైనా ఫెయిలయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ భారీగా పరుగులిచ్చాడు.

మ్యాచ్ విన్నర్ కాకున్నా ప్రసిద్ధ కృష్ణను తుది జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారనేది గంభీరే చెప్పాలి. అటు గంభీర్ ప్రియశిష్యుడు హర్షిత్ రాణాకు ఎప్పటిలానే వరుస అవకాశాలు వస్తున్నాయి. వికెట్లు తీసినా పరుగులు మాత్రం భారీగా సమర్పించుకుంటున్నాడు. మూడో వన్డేలో అయితే ఏకంగా 84 పరుగులు ఇచ్చేశాడు. ఈ వైఫల్యం కవర్ చేసుకునేందుకే హర్షిత్ రాణా బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టాడేమో అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అటు స్పిన్నర్లది కూడా ఇదే పరిస్థితి. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మ్యాజిక్ పనిచేయడం లేదు. అతని కెరీర్ ఇక ముందుకు సాగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుల్దీప్ యాదవ్ కూడా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి బౌలింగ్‌తో మ్యాచ్‌లు గెలవాలనుకోవడం అత్యాశే అవుతుందని మాజీలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవేళ జట్టులో బుమ్రా ఉన్న  10 ఓవర్ల స్పెల్‌తో ఎన్ని మ్యాచ్‌లు గెలిపించగలడని పలువురు ప్రశ్నిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో ఏ ఒక్కరిపైనో పూర్తిగా ఆధారప డలేం. మరి 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కోచ్ గంభీర్ మన బౌలింగ్ దళంపై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరమైతే కనిపిస్తోంది.