03-05-2025 01:24:58 AM
జిల్లాకు ఒక మండలంలో రెవెన్యూ సదస్సులు
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మహబూబాబాద్, మే 2 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, భూ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ఒక మండలంలో ఈనెల ఐదు నుండి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, భూభారతి చట్టం ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి అధికారులు సందర్భం కావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాదు నుండి మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనెల 5 నుండి 20 వరకు పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
జూన్ 2 వరకు పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహించిన గ్రామాల వారిగా దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,13,000 ఇండ్లు మంజూరయ్యాయని ప్రతి నియోజకవర్గ పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో కనీసం 500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పొ, కే.వీర బ్రహ్మచారి, మహబూబాబాద్, తొర్రూరు ఆర్డీవోలు కృష్ణవేణి, గణేష్, జెడ్పి సీఈవో పురుషోత్తం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.