03-05-2025 01:22:50 AM
పోలీస్ స్టేషన్ ఎదుట పొరండ్ల గ్రామస్తుల ధర్నా
జగిత్యాల అర్బన్, మే 2 (విజయక్రాంతి): జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట మండలం లోని పోరండ్ల గ్రామస్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన పడిగెల మల్లారెడ్డి (46)కి అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురికి మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం మల్లారెడ్డి పురు గుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మల్లారెడ్డి శుక్రవారం మృతి చెందడంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. మృతుడు మల్లారెడ్డి కి గ్రామంలో ఎకరంన్నర భూమి ఉంది. సదరు భూమితోపాటు శివారులో ఉన్న ఆరుగుంటల స్థలాన్ని కూడా అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆక్రమించుకు న్నారని, ఈ విషయంలో పలుసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీస్ లు పట్టించుకోలేదని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
భూమిని ఆక్రమించడమే కాకుండా చంపేస్తామంటూ బెదిరిస్తుండటంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఎస్‌ఐ సదాకర్ లు చేరుకొని విచారణ చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.