07-11-2025 09:40:56 PM
ఇండ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభించని వివరాలను అధికారులు అందజేయాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి మరింత వేగవంతంగా సాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ, డిఆర్డిఓ, మెప్మా, ఎంపీడీవోలతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని మండలాలు, మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, ఇంకా ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారుల సంఖ్య, తదితర అంశాలను జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వారం రోజుల్లోగా ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 295 స్లాబ్ లెవెల్ వచ్చిన ఇండ్లు పది రోజుల్లో లబ్ధిదారులు పూర్తి చేసుకునే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎంజిఎన్ఆర్ఇజిఎస్, ఎస్బిఎం కింద ఇందిరమ్మ లబ్ధిదారులను ఆ పథకాలకు అనుసంధానం చేయాలన్నారు. ఇంకా లబ్ధిదారులు ఎవరైనా మిగిలి ఉన్నట్లయితే వారిని త్వరగా గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ప్రాంతాలకు సంబంధించి తక్కువ ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు.
మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులకు రూ.లక్ష లోపు రుణాలను అందించి త్వరగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా అధికారులు తోడ్పాటును అందించాలన్నారు. 2 బిహెచ్కె ఇండ్ల కు లబ్ధిదారుల ఎంపికను వారం రోజుల్లో గుర్తించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పైలట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని అధికారులు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు లబ్ధిదారులు త్వరగా పూర్తిచేసునేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మేన శ్రీను, గృహ నిర్మాణ శాఖ పీడీ హరికృష్ణ, మెప్మా పీడీ జోనా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డివిజన్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మ, హౌసింగ్ డిఈలు రవీందర్, సిద్ధార్థ నాయక్, ఎంపీడీవోలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.