07-11-2025 09:46:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆడెల్లి నూతన దేవాలయ ప్రారంభోత్సవం, పోచమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకల సందర్భంగా కలెక్టర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ కు ఆలయ పండితులు, అధికారులు స్వాగతం పలికారు. నూతన ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు.
అర్చకులు అమ్మవారి ఆశీర్వచనాలు, మంగళహారతులు, తీర్థప్రసాదాలు కలెక్టర్ కు అందజేశారు. శాలువాతో సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, సర్వాంగ సుందరంగా నూతన ఆలయం ప్రారంభించుకొని, అమ్మవారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరారు.
భక్తులందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించాలని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తహసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మీకాంత్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ భోజా గౌడ్, ఈవో భూమయ్య, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.