12-05-2025 01:00:25 AM
మహబూబాబాద్, మే 11 (విజయక్రాంతి): షీర్ వాల్ పద్ధతి ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పక్షం రోజుల్లో పూర్తి చేయవచ్చని ఓ స్టార్టప్ కంపెనీ ప్రయోగత్మకంగా నిర్మించి చూపింది. రూ. 5 లక్షల వ్యయంతో పక్షం రోజుల్లో 400 చదరపు అడుగుల్లో నమూనా ఇంటిని నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో వివిధ ఏజెన్సీలో ఇండ్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నాయి.
టోకుగా ఇండ్ల నిర్మాణానికి తమకు అనుమతి ఇస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన విధంగా ఇండ్లను నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ ఆమోదించి ప్రతిపాదించిన ఓ స్టార్టప్ కంపెనీ సంగారెడ్డి జిల్లా జిన్నారం లో నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని షీర్ వాల్ పద్ధతి ద్వారా ఇటుకలు లేకుండా స్టీల్ సిమెంట్ కంకర రెడీ మిక్సింగ్ ద్వారా ఐదు రోజుల్లో పునాది, ఆరు రోజుల్లో గోడలు, ఇంటి పై కప్పు వేసి మిగిలిన నాలుగు రోజుల్లో మిగతా పనులు పూర్తిచేసిందని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్ తెలిపారు.
ఐదు లక్షలకు మించకుండా, అదనపు ఖర్చు లేకుండా లబ్ధిదారులకు కేవలం ఆరుగురు కార్మికులతోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వానికి నివేదించి ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చే గుర్తింపు పొందిన కంపెనీలకు ఇండ్ల నిర్మాణానికి అవకాశం కల్పిస్తామని చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్ తెలిపారు.
60 ఏళ్ల వరకు మన్నిక నాణ్యతగా పనులు
షీర్ వాల్ పద్ధతిలో నిర్మించే ఇండ్లు అరవై ఏళ్ల వరకు మన్నికగా ఉంటాయని నమూనా ఇంటి నిర్మాణ సంస్థ ప్రకటించింది. 22.3 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పుతో 400 అడుగుల స్లాబ్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. 150 ఎంఎం మందంతో ప్లాస్టరింగ్ అవసరం లేకుండా బయటికి గోడలు, 8 ఎంఎం, 10 ఎంఎం స్టీల్, రెడీమిక్స్ సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్ తో గోడలు, స్లాబ్ నిర్మించారు.
ఫలితంగా గోడలకు ఎలాంటి పగుళ్లు రావని, అలాగే స్లాబ్ ఎక్కడ కూడా లీక్ అయ్యే ప్రసక్తి లేదన్నారు. ఇదిలా ఉంటే షీర్ వాల్ పద్ధతిలో నిర్మించే ఇల్లు జీ ప్లస్ వన్ వినియోగించవచ్చని, భవిష్యత్తులో మరొక అంతస్తు వేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.