calender_icon.png 20 May, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

20-05-2025 12:48:01 AM

కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే-19(విజయ క్రాంతి) పైలెట్ గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, కొనిజర్ల మండలం చిన్నగోపతి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఇండ్ల లబ్ధిదారులతో నిర్మాణంలో సాదకబాదకాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం కావాలి, ఇసుక, మట్టి అందుతుందా అడిగి తెలుసుకున్నారు. సిమెంట్, స్టీల్ తదితర సామాగ్రి గ్రూప్ గా ఏర్పడి, ఒకేచోట కొంటె తక్కువ ధరకు దొరుకుతుందని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల నుండి ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. పైలట్ గ్రామాల్లో 875 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

మంజూరు ఇండ్లలో 568 ఇండ్లు పునాదుల స్థాయి, 442 బేస్మెంట్ పూర్తి, 70 ఇండ్లు రూఫ్ స్థాయి, 5 స్లాబ్ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. 420 మందికి చెల్లింపులు చేశామన్నారు. పునాది పూర్తయిన తర్వాత రూ. లక్ష, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత రూ. 1.25 లక్షలు, స్లాబ్ దశలో రూ. 1.75 లక్షలు, నిర్మాణం పూర్తిగా పూర్తయిన తర్వాత రూ. లక్ష లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తామని  తెలిపారు.

అర్హులై పునాది స్థాయి వరకు కట్టుకోలేని వారికి మహిళా సంఘాల ద్వారా డబ్బు ఇప్పించుటకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అన్నారు. చిన్నగోపతి గ్రామంలో 52 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, 43 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించమన్నారు. 5 ఇండ్లు రూఫ్ స్థాయి, 10 ఇండ్లు లేంటల్ స్థాయి, మిగతావి బేస్నెంట్ స్థాయిలో ఉన్నాయన్నారు.

అధికారులు ఇండ్ల పురోగతిని నిరంతర పర్యవేక్షణ చేయాలని, లబ్ధిదారులకు ప్రతి దశలో ప్రభుత్వం నుండి సహకారం అందించాలని, తక్కువ ధరలో నాణ్యమైన నిర్మాణం చేపట్టేలా సలహాలు, సహకారం అందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, ఇంచార్జ్ తహసీల్దార్ రాము, హౌజింగ్ డిఇ పి. సాయిరాం రెడ్డి, ఏఇ ఉమామహేశ్వర రావు, చిన్నగోపతి పంచాయతీ కార్యదర్శి జ్యోతి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.