29 March, 2026 | 6:59 AM

కాంగ్రెస్‌తోనే మెదక్‌లో పారిశ్రామికాభివృద్ధి

05-05-2024 01:36 AM

ప్రైవేటీకరణను పెంచి పోషిస్తున్న మోదీ ప్రభుత్వం

బీజేపీకి ఓట్లేస్తే బానిస బతుకులు అవుతాయి

నీలం మధును భారీ మోజార్టీతో గెలుపించండి

సీపీఎం కార్యకర్తల సమావేశంలో మంత్రి కొండా సురేఖ

సంగారెడ్డి, మే 4 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేస్తే బానిస బతుకులు ఆవుతాయని, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు ఓట్లు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని మంత్రి కొండా సురేఖ కోరా రు. శనివారం సంగారెడ్డిలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన సీపీఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రైవేటీకరణను పెంచి పోషిస్తున్న ప్రధాని మోదీకి పేదల కష్టాలు, సంక్షేమం, చదువు, వైద్యం పట్టడంలేదని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు ఏం కావాలో అది మాత్రమే చేస్తున్నదని దుయ్యబట్టారు. మెదక్ జిల్లాలో ఇందిరాగాంధీ ఉన్న సమయంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. రాజీవ్‌గాంధీ హయాంలో దేశంలో ఐటీ రంగానికి తగిన ప్రాధాన్యం కలిపించారని గుర్తుచేశారు.

కాంగ్రెస్ హయాంలోనే మహిళా బిల్లు తీసుకొచ్చారని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు మాట్లాడుతూ.. దేశంలో మతోన్మాద రాజకీయ శక్తులను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి బీజేపీకి బుద్ధిచెప్పాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కలిపించడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ మళ్లీ అధికారంలోని వస్తే కార్మిక చట్టాలను ఖతం చేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. సమావేశంతో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజు, సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, నాయకులు మల్లారెడ్డి, మల్లేశం, మల్లికార్జున్, కే రాజయ్య, మణిక్యం పాల్గొన్నారు.