21 August, 2026 | 1:18 AM

కుమ్ములాటల కాంగ్రెస్..గెలుపు ఎలా?

21-08-2026 12:37 AM
  1. 2028లోనూ అధికారంపై ధీమా
  2. పార్టీలో మాత్రం అంతర్గత పోరు
  3. సీనియర్ల ధిక్కార స్వరం
  4. షోకాజ్‌లపైనా అసంతృప్తి
  5. ఓసీలకు ఒక న్యాయం.. మిగతా వర్గాలకు ఒక న్యాయమా?
  6. పీసీసీపై బహిరంగంగానే విమర్శలు
  7. పరిస్థితి మారకపోతే ఎదురుదెబ్బ తప్పదా?  

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాం తి) : ‘తెలంగాణలో మరోసారి అధికారంలో కి వస్తాం. 2028లో రెండోసారి గెలిచి తీరు తాం. 2034 వరకు మాదే అధికారం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు అధికార కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అంతర్గత విభేదాలు, నిత్య కు మ్ములాటలు, పరస్పర విమర్శలు, ఆదిపత్య పోరు అధికార కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారుతోంది.

విపక్షాల విమర్శలకు సమష్టిగా సమాధానం చెప్పాల్సిన నేతలే.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఘర్షణల కు దిగడం, నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా బహిర్గతపర్చడం, విమర్శలకు దిగడం, ధిక్కారస్వరం వినిపించడం కొత్తేమీ కాదు. అయితే అదే స్వేచ్ఛ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మా రడంతో పాటు క్రమశిక్షణకు సవాల్‌గా మా రుతోందన్న విమర్శలున్నాయి. 

షోకాజ్‌ల విషయంలోనూ భిన్నాభిప్రాయాలు

షోకాజు నోటీసులు, క్రమశిక్షణ చర్యల విషయంలో పార్టీ నాయకత్వం వ్యవహరిస్తు న్న తీరుపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓసీలకు ఒక న్యా యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విషయంలో మరో రకంగా వ్యహరిస్తుందని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. పార్టీపైన, ప్రభుత్వంపైనా కొంత కాలంగా ధిక్కార స్వరం వినిపిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కో మటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విషయంలో మెతకవైఖరి అవలంభిస్తున్న టీపీసీసీ.. బీసీ వర్గానికి చెందిన మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేయటంతో అంతర్యం ఏమి టి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మంత్రి కొండా సురేఖ కూతురు సు స్మిత మాట్లాడితే.. కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వడమేంటి? మిగతా వారి విషయంలో పీసీసీ నాయకత్వం అంతే వేగం గా ఎందుకు స్పందించడం లేదు? అని కాం గ్రెస్‌లోని మరొక వర్గం మండిపడుతోంది. ఓట్ల విషయానికి వచ్చే సరికి తమకు అన్ని వర్గాలు సమానమేనని, అందరికీ సముచిత స్థానం ఉంటుందని చెబుతున్న పార్టీ నాయకత్వం.. అధికారంలోకి వచ్చాక కొన్ని వర్గాల ను విస్మరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. 

దీనికి మరో సబ్ శీర్షిక సీనియర్ల తీరుపై జూనియర్లు గుర్రు

పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్నందున కొందరు నాయకుల తీరు క్రమశిక్షణ కట్టుతప్పుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గత పరిస్థితులకు భిన్నంగా నాయకులు వ్యవహరిం చాల్సి అవసరం ఉందని పలువురు అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీ పదవులు అనుభ వించిన కొందరు సీనియర్ల వ్యవహరిస్తున్న తీరుపైన పార్టీలోని జూనియర్లు, యువ నాయకత్వం అసంతృప్తితో ఉంది.

క్షేత్రస్థాయి క్యాడర్‌కు ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్లు పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరించడం.. ప్రతిపక్షాలకు  ఆయుధం ఇచ్చినట్టేనని మండిపడతున్నారు. పార్టీ విజయం కోసం క్షేత్రస్థాయిలో క్యాడర్ కష్టపడి పనిచేస్తే.. అధికారంలోకి వచ్చాక పదవులు అనుభవిస్తున్న పలువురు నాయకులు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని, కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితి మారకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి  గడ్డు పరిస్థితులు తప్పవన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. 

పీసీసీకి తలనొప్పిగా అంతర్గత పోరు

రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో  రచ్చకెక్కిన అంతర్గత పోరు పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారగా.. తాజగా వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పరిణామాలు మరింత ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. కాంగ్రెస్‌లో సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య కొంతకాలంగా నెలకొన్ని వర్గపోరు తాజాగా బయటపడటం, అది కాస్తా గాంధీభవన్‌కు చేరింది.

గతంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉండి పార్టీలోని పలువురికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన చిన్నారెడ్డి.. ఇప్పుడు ఆయనే షాకోజ్ నోటీసులు అందుకోవడం విశేషం. అన్ని వర్గాల విషయంలో పార్టీ ఒకే విధంగా వ్యవహరించాలనే డిమాండ్ వినిపిస్తోంది.