15-05-2025 01:39:42 AM
తుర్కయంజాల్, మే 14: తుర్కయంజాల్ మున్సిపాలిటీలో పరిస్థితులు దోచుకున్నోడికి దోచుకున్నంత చందంగా మారాయి. రాష్ట్రంలో, ఇబ్రహీంపట్నంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే కొందరిదే హవాగా మా రిపోయింది. వారు చెప్పింది రెవెన్యూ, ము న్సిపల్ అధికారులు సచ్చినట్లు చేయాల్సిం దే.
ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాని చోట పర్మిషన్లు ఇప్పించగలరు. మెయిన్ రో డ్డుపై కమర్షియల్ షెడ్లను నయాపైసా ఖర్చు లేకుండా నిర్మించి ఇవ్వగలరు. చెరువు నడిమధ్యలో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్లు ఇప్పించగలరు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నిండు ఎఫ్టీఎల్లో 12 పర్మిషన్లు ఇప్పించిన ఘనులు ఎవరు? వారికున్న అండదండలేంటి?
భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణా న్ని, మెరుగైన జీవనాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో రేవంత్ సర్కార్ హైడ్రా ను తీసుకొచ్చింది. ప్రకృతి వైపరీత్యాల నుం చి ప్రజలకు రక్షణ కల్పించడం, ప్రభుత్వ ఆ స్తులను కాపాడటం, చెరువుల పరిరక్షణ, ప్రజల అవసరాల కోసం కేటాయించిన పార్కులను కాపాడటమే ధ్యేయంగా హైడ్రా ను తీసుకొచ్చినట్టు ఓ వైపు ప్రభుత్వం చెప్పుకుంటోంది.
కానీ క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో అక్రమార్కులు రెచ్చిపో తున్నారు. చెరువులను, కుంటలను క బ్జా చేసి, ప్లాట్లుగా మలిచి అమాయకులకు విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవె న్యూ, మున్సిపల్ అధికారులకు తెలియడం లేదా? అంటే, వారికి తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. పైనుంచి ఒత్తిళ్లే దీనికి కారణం.
ఇంజాపూర్లోని సర్వే నెంబర్ 98, 99లో గూడెంకుంట అనే ఓ చెరువు ఉంది. సుమా రు 16 ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది. గతంలో వర్షాలు కురవకపోవడంతో ఈ చెరువు పూర్తిగా ఎండిపోయింది. ఇదే అదునుగా భావించిన ఓ రాజకీయ నాయకుడు రైతుల నుంచి భూమి కొనుగోలు చేసి, లే అవుట్ వేశాడు. సర్వే నెంబర్లు 98, 99 ఇప్పటికీ ఎఫ్టీఎల్ లోనే చూపిస్తోంది. 98 సర్వే నెంబర్ సుమారు 90శాతం ఎఫ్టీఎల్లోనే ఉంటుంది.
99 సర్వే నెంబర్ దాదాపు చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉంటుంది. అయితే లే అవుట్ చేసిన సదరు రాజకీయ నాయకుడు ప్లాట్లను అమాయక ప్రజలకు విక్రయించాడు. 2020-21లో భారీ వర్షాల కారణంగా ఈ చెరువు పూర్తిగా నిండిపోవడంతో ప్లాట్ల యజమానులకు అవగతమైంది.
ప్రస్తుతం చెరువు మళ్ళీ పూర్తిగా ఎండిపోవడంతో ప్లాట్ల యజమానులు ఇండ్లు కట్టుకునేందుకు ప్రయత్ని స్తున్నారు. ఎఫ్టీఎల్ చూపి స్తుండటంతో మున్సిపల్ పర్మిషన్లు రావడం లేదు. దీంతో ఓ స్థానిక లీడర్ ప్రమేయం, రాజకీయ అండదండలతో మున్సిపల్ అనుమతులు గాల్లో ఎగురుకుంటూ వచ్చేశాయ్.
‘లే అవుట్కు అక్రమంగా అనుమతులు?’
2016లో చేసిన ఈ లేఅవుట్కు అక్రమం గా ఎన్వోసీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లే అవుట్కు ప్రధాన రోడ్డును 30 ఫీట్ల రహదారిగానే చూపారు. ఈ రోడ్డు ఇంజాపూర్ బా లాజీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమిలో నుంచి చూయించారు.
ఇంత జ రుగుతున్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూ డా పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం. ఆల య భూములకు కనీసం పెన్సింగ్ కూడా వే యలేని దుస్థితిలో ఉంది. లే అవుట్ చేసిన వ్యక్తికి రాజకీయ పలుకుబడి ఉండటంతో ఈ తతంగమంతా మూడుపువ్వులు ఆరుకాయలుగా విలసిల్లుతోంది.
‘ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతులు’
98, 99 సర్వే నెంబర్లు హెచ్‌ఎండీఏ మ్యా పులలో కన్జర్వేషన్, ఎఫ్టీఎల్ అని చూపిస్తోం ది. నిబంధనల ప్రకారం పూర్తి ఎల్‌ఆర్‌ఎస్ లేకుండా మున్సిపల్ అనుమతులు ఇవ్వడానికి వీల్లేదు. ఇదే కాకుండా ఇంజాపూర్కు చెందిన ఓ రైతు ఈ భూమిపై కేసు వేశారు. ఈ కేసు రంగారెడ్డి జిల్లా కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ రెండు అంశాల వల్ల సదరు లేఅవుట్లో మున్సిపల్ పర్మిషన్లు ఇవ్వడమనేది అసాధ్యం.
అయితే శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరు మీద ఏకంగా 12 ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి అనుమతులు వచ్చాయి. ఇదెలా సాధ్యమైందో స్థానిక మున్సిపల్ అధికారులకే తెలియాలి. స్థానికంగా ఉండే ఓ రాజకీయ నాయకుడు ఈ పర్మిషన్లు ఇప్పించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేను బూచిగా చూపి, మున్సిపల్ అధికారు లను భయపెట్టి ఈ అనుమతులు పొందినట్లు గుసగుసలు వినబడుతున్నాయి.
‘చర్యలుంటాయా?’
వ్యయసాయ భూమి కన్వర్షన్ లేకుండా లే అవుట్ వేయడం ఎలా సాధ్యం? చెరువు ఎఫ్టీఎల్, కన్జర్వేషన్ జోన్ లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా వచ్చాయి అనేది వేయి డాలర్ల ప్రశ్న. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు కళ్లు ఎందుకు మూసుకొని ఉంటున్నారు? రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎందుకు మిన్నకుంటు న్నారో తెలియడంలేదని స్థానికులు వాపోతున్నారు.
ఈ విషయంలో ఉన్నతాధికారులు ఇన్వాల్వయి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మె ల్యే కలుగజేసుకొని చెరువును కాపాడాలని కోరుతున్నారు. పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
విచారణ జరుపుతాం..
ఇంజాపూర్‌లోని సర్వే నెంబర్లు 98, 99లో గూడెంకుంట చెరువు ఉందని ఫైనల్ నోటిఫికేషన్లో వచ్చింది. ప్రస్తుతం ఆ సర్వే నెంబర్లలో పర్మిషన్లు ఇవ్వడం లేదు. గతం లో ఇచ్చిన పర్మిషన్లపై విచారణ జరుపుతాం. ఆ పర్మిషన్లను రద్దు చేయాలని టీఎస్ బీ పాస్‌కు విన్నవిస్తాం.
అమరేందర్‌రెడ్డి, కమిషనర్