calender_icon.png 3 August, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇంటి కోసం సెల్ టవర్ ఎక్కి నిరసన

03-08-2025 12:55:53 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇల్లు తనకు ఇవ్వలేదని, గ్రామంలో అనర్హులకు ఇండ్లు ఇచ్చారని, తనకు కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం(Maripeda Mandal) తానంచెర్లలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బాసనపల్లి రాములు అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అతనికి ఇవ్వకుండా గ్రామంలో అతని కంటే ధనికులైన వారికి ఇచ్చారని ఆరోపించాడు.

పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా తనకు మొండి చేయి చూపారని ఆరోపించాడు. తనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే తప్ప సెల్ టవర్ నుంచి దిగేది లేదంటూ భీష్మించాడు. రాములు సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగిన ఘటన తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, అధికారులతో మాట్లాడి ఇల్లు ఇప్పిస్తామని నచ్చజెప్పి సెల్ టవర్ దించారు.  ఈ ఘటన వల్ల గ్రామస్తులు కొంతసేపు ఉత్కంఠకు గురయ్యారు. పోలీసుల జోక్యంతో రాములు సెల్ టవర్ దిగడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.