09-01-2026 12:39:05 AM
కేంద్రం హెచ్చరించినా బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు
కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, జనవరి 8 (విజయక్రాంతి): కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే కృష్ణ జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేంద్రం అనేకసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. నీళ్ల విషయంలో పాలకుల తప్పిదాలను సరిదిద్దడానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఏపీ ప్రభుత్వం అక్రమంగా సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై పత్రికల్లో, టీవీల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.
ఏపీ ప్రభుత్వం ఒప్పందానికి మించి 38 టీఎంసీల నీళ్లను అదనంగా వాడుకుందని మొత్తుకున్నా ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని మండిపడ్డారు. అప్పటి ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డితో ప్రగతి భవన్‌లో మీటింగ్ పెట్టుకుని ‘బేసిన్లు లేవ్... బేషజాల్లేవు’ అని మాట్లాడింది నిజం కాదా? రాయలసీమకు అవసరమైనన్ని నీళ్లను తరలించేందుకు సిద్దమని ఒప్పుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. నాటి మంత్రి రోజా పెట్టిన రొయ్యల పులుసు, గులాబీ రేకుల స్వాగతంతో ఖుషీ అయ్యి ఏపీకి పెద్దన్నగా మారతానని డాంబికాలు పలకలేదా అని అన్నారు.
కేసీఆర్ సర్కార్ అవినీతి, అక్రమాలను బయటపెడుతున్న కల్వకుంట్ల కవితకు హ్యాట్సాఫ్ అని, ఎవరు అవినీతి, అక్రమాలు బయపెట్టినా కేంద్రం వారికి సహకరిస్తుందన్నారు. రోజా ఇంట్లో దావత్ వెనుక ఉన్న మర్మమేందో కూడా కవిత బయటపెట్టాలని కోరారు. కేసీఆర్ తెలంగాణకు చేసిన నీళ్ల ద్రోహాన్ని ఎండగడుతూ అడుగడుగునా ఉద్యమాలు చేసింది బీజేపీయేనని, బీజేపీ రాష్ర్ట అధ్యక్ష హోదాలో అనేకసార్లు కేసీఆర్ కు లేఖలు రాసి హెచ్చరించానని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపాలని ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. కేసీఆర్ పట్టించుకోకపోవడంతో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది తానేనని చెప్పారు.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు రావాలని ఏపీ, తెలంగాణ సీఎంలను ఆహ్వానించినా కేసీఆర్ ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కు డుమ్మా కొట్టారని విమర్శించారు. కేసీఆర్ చేసిన అన్యాయాన్ని నిలదీస్తూ నిరసనలు చేయడంతో కేసీఆర్ 575 టీఎంసీల నీరు కావాలంటూ యూటర్న్ తీసుకున్నాడని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపాలని అనేకసార్లు సీఎంకు, కేంద్రానికి లేఖ రాసింది తానేనని, కేఆర్‌ఎంబీ ద్వారా లేఖ రాసి ఆ ప్రాజెక్టును ఆపింది కేంద్రమేనని వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెపుతూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపింది మేమేనని బాకాలు కొడుతున్న కాంగ్రెస్ దమ్ముంటే రుజువు చేయగలదా అని సవాల్ విసిరారు.