30-12-2025 06:39:08 PM
అచ్చంపేట: రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచామని అచ్చంపేట మండల వ్యవసాయ అధికారి కే.కృష్ణయ్య తెలిపారు. యూరియా కొరత ఉందనే మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని హెచ్ఏసిఏ కేంద్రంలో యూరియా నిల్వలను పరిశీలించారు. మండలంలోని రైతులకు అచ్చంపేటలోని పిఎసిఎస్, హెచ్ ఏ సి ఏ ద్వారా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యూరియా పంపిణీ, విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. ఎరువుల డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే యూరియా విక్రయాలు చేయాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, అనధికార విక్రయాలు జరిగితే సహించేది లేదన్నారు. రైతులు అవసరమైన మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేసుకోవద్దని సూచించారు.