19 June, 2026 | 1:37 AM

పైప్‌లైన్ లీకేజీలు, సీవరేజ్ ఓవర్‌ఫ్లో ప్రాంతాల పరిశీలన

19-06-2026 12:00 AM

సికింద్రాబాద్ జోన్‌లో పర్యటించిన హైదరాబాద్ జలమండలి రీజియన్ ఈడీ సామ్రాట్ అశోక్

సికింద్రాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): జలమండలి హైదరాబాద్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సామ్రాట్ అశోక్ గురువారం సికింద్రాబాద్ జోన్ పరిధిలోని తార్నాక సర్కిల్లో ప్రధాన నీటి లీకేజీలు, సీవరేజ్ ఓవర్ఫ్లో ప్రాంతాలు, ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్లు, రిజర్వాయర్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తార్నాక ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్లో మిగులు క్లోరిన్ స్థాయిని తనిఖీ చేసి, ఎంసీసీ ద్వారా అందుతున్న ట్యాంకర్ ట్రిప్పులను అదే రోజు డెలివరీ చేయాలని ఆదేశించారు.

అలాగే రిజర్వాయర్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు, వెంటిలేటర్లకు రక్షణ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.అనంతరం తార్నాక మెట్రో స్టేషన్, లాలాపేట్ ఫ్లైఓవర్, హబ్సిగూడ సిగ్నల్, తార్నాక ఎక్స్ రోడ్స్ ప్రాంతాల్లో పైప్ లైన్ లీకేజీలు, సీవరేజ్ ఓవర్ఫ్లో సమస్యలను పరిశీలించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో లీకేజీలు, సీవరేజ్ సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఈడీ సామ్రాట్ అశోక్ సూచించారు.ఈ పర్యటనలో జీఎం వినోద్ కుమార్, డీజీఎంలు, మేనేజర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.