మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాటం చేయాలి
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు, మే1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మేడే’ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీపీఐ కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఎగురవేసి, ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో మిల్లు, భవన నిర్మాణ, బజారు, మార్కెట్ హమాలీలు, చిరు వ్యాపారులు, సెంట్రింగ్ వర్కర్లు పాల్గొన్న పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
8 గంటల పనిదినం, కార్మిక హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాల ఫలితాలను నేటి పాలకులు కాల రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలంలో సాధించిన కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి, కార్మికులను బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకు అప్పగించడం ద్వారా దేశ సంపదను దోచిపెడుతున్నారని అన్నారు.గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారా న్ని మోపుతున్నారని మండిపడ్డారు.
కార్పొరేట్ అనుకూల విధానాలు, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి కార్మికుడు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని, సామాజిక మార్పు కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురజా రామచంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఏఐవైఎఫ్, మహిళా సమాఖ్య ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.






