26-10-2025 12:59:11 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కర్నూలు బస్సు ప్రమాద ఘటన తో తెలంగాణ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులపై కేసులు నమోదు చేయగా, కొన్నింటిని సీజ్ చేసి జరిమానా విధించారు. విజయవాడ, బెంగళూరు జాతీయ రహదారులపై ఆర్టీఏ అధికారులు బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు చేపట్టారు.
రాజేంద్ర నగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేశారు. ఏపీ నుంచి ఇతర ప్రాంతాల్లో నుంచి వచ్చే బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బస్సుల్లోని ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లు, అగ్నిమాక యంత్ర పరికరాలను పరిశీలిం చారు. జడ్చర్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురై అద్దం పగిలిన ఓ ట్రావెల్స్ బస్సును అలాగే నడుపుతుండటంతో దానిని అధికారులు సీజ్ చేశారు.
హైదరాబాద్ యవాడకు వెళ్లే బస్సులను ఎల్బీనగర్‌లో తనిఖీలు చేశారు. ఓ వాహనం నిబంధల మేరకు 23 సీటింగ్ కెపాసిటీ ఉండగా 29 సీట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం మధ్యాహ్నం వరకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మూడు జిల్లాల్లో 68 కేసులు నమోదు చేయగా, కాంపౌండింగ్ ఫీజు రూ.1 1,70,000 విధించారు. నాలుగు బస్సులు సీజ్ చేశారు.
జనవరి నుంచి 877 వాహనాలు సీజ్..
ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 25 వరకు మొత్తం 877 ప్రైవేట్ వాహనాలను అధికారులు సీజ్ చేశారు. మొత్తం 8,848 కేసులు నమోదు చేశారు. కాంపౌండింగ్ ఫీజు రూ.2.28 కోట్లు, ట్యాక్స్, జరిమానా రూ.14.68 కోట్లు విధించారు. ఇదిలా ఉంటే కర్నూలు బస్సు ప్రమాద ఘటన జరిగినప్పుడు మాత్రమే ప్రైవేట్ బస్సులపై అధికారులు తనిఖీలు నిర్వహించి ఆతర్వాత చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ తనిఖీలు కేవలం ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టడం కంటే నిత్యం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఎల్బీనగర్‌లో: శనివారం ఉదయం 5 గంటల నుంచి రామోజీ ఫిలిం సిటీ, ఆటోనగర్, చింతలకుంట, ఎల్బీనగర్ వరకు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్, ఫిట్‌నెస్, పర్మిట్ పేపర్లు, పొల్యూషన్ పత్రా లు, బస్సు లోపల భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. చాలా బస్సుల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి ఉపయోగపడే ఎగ్జిట్ డోర్లకు అడ్డంగా బెడ్లు ఏర్పాటు చేశారు.
ఫైర్ యాక్సిడెంట్ కంట్రోల్ కోసం ఉంచాల్సిన ఫైర్ సేఫ్టీ సిలిండర్లు లేకపోవడం, డమ్మీ సిలిండర్లను పెట్టడాన్ని ఆర్టీఏ అధికారులు గుర్తించారు. కొన్ని బస్సుల్లో సిలిండర్లు గడువు ముగిసినవిగా గుర్తించారు. ఎమర్జెన్సీ టైమ్లో కిటికీ అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటపడటానికి ఉపయోగించే హామర్లు కూడా బస్సుల్లో లేవు. దూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సులకు రూల్స్ ప్రకారం..
ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణికులను తీసుకువచ్చిన రాయల్ వర్మ ట్రావెల్స్ బస్సులో ఒకే డ్రైవర్ ఉండటాన్ని అధికారులు గుర్తిం చి, సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు.