calender_icon.png 29 July, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పామ్‌పై ఆసక్తి..

26-07-2025 12:35:41 AM

-జిల్లాలో ఏడాదిలో మూడంతలు

-మార్కెట్ సౌకర్యం, ధరల గ్యారెంటీతో రైతుల్లో ఆసక్తి

నల్లగొండ టౌన్, జూలై 22 : ఆయిల్పామ్ సాగుపై ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతు లు ఆసక్తి చూపిస్తున్నారు. ఏడాదిలో రెండింతల సాగు పెరిగింది. వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఆయిల్పామ్ సాగుచేసే రైతుల కు రాయితీలు ఇస్తోంది. కంపెనీలు గ్యారెంటీ ధరలతో రైతుల వద్ద దిగుబడులను కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆయిల్ పాం సాగువైపు దృష్టి సారించారు. 

జిల్లాలో వాస్తవంగా వరి పంట, బత్తాయి పండ్ల తోటల సాగుకు పెట్టింది పేరు. కానీ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే దేశంలో పామ్ ఆయిల్ కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ఆ పంట సాగు కోసం ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. జిల్లాలో 6500 ఎకరాలలో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే 10,750  ఎకరాలలో మొక్కలు కూడా నాటడం జరిగింది. ఒక్క ఎకరానికి 57 మొక్కలు నాటుకోవచ్చు. ఒక మొక్క ఖరీదు 193 రూపాయలు. అయితే 20 రూపాయలు మాత్రమే రైతు వాటాగా చెల్లించాలి. నాలుగు సంవత్సరాల పాటు తోట నిర్వహణ కోసం ఏడాదికి రూ.4200 చొప్పున ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది.

చీడపీడల బెడదగ లేదు...

ఆయిల్పామ్ సాగులో సస్యరక్షణ చర్యల గురించి రైతులకు ఇబ్బందులు తలెత్తవని అధికారులు చెబుతున్నారు. పండ్ల తోటల్లాగా ఈ పంటకు కోతుల, చీడపీడల బెడద ఉండదని, దిగుబడి నష్టం అనేది ఉండదంటున్నా రు. నీటి వినియోగం కూడా తక్కువ. ఒక్క ఎకరా వరి సాగుకు సరిపడే నీటితో నాలుగు ఎకరాల్లో ఆయిల్పాం ను సాగు చేయవచ్చు. ఎకరానికి 57 మొక్కలు నాటుతా రు. ఒక్కో చెట్టుకు 15 గెలల వరకు వస్తాయి. ఒక్కో గెల కోతకు వచ్చేందుకు 50 రోజుల సమయం పడుతుంది. ఒక గెల సుమారు 40 నుంచి 60 కిలోల బరువు తూగుతుంది. అంతర పంటల సాగుకు ఎకరానికి రూ.4,200 చొప్పున రైతుఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది.

అంతర్పంటల సాగుతో అదనపు ఆదాయం..

ఆయిల్పామ్ పంట దిగుబడి వచ్చేందుకు నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ నాలుగేళ్ల పాటు అంతర్ పంటగా పత్తి, మిరప, పెసర, మినుము, బొబ్బెర, కంది సాగుచేయవచ్చు. రాయితీపై మొక్కలు, డ్రిప్‌ఏర్పాటు, అంతర్పంటల సాగుకు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. అంతర్పంటలసాగుతో ఎకరానికి రూ.30వేలవరకు ఏటా ఆదాయం పొందే అవకాశం ఉంది.

జిల్లా వారీగా కంపెనీలు...

ఆయిల్పామ్ 1993-యాక్ట్ ద్వారా జిల్లాలో ఆయిల్పామ్ సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన, నర్సీల పెంపకం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు జిల్లాల వారీగా కంపెనీను కేటాయించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు పతంజలి కంపెనీకి, యాదాద్రి జిల్లా ఆయిల్ఫెడ్ కంపెనీకి కేటాయించారు. నల్లగొండ జిల్లాలో మూడు, సూర్యాపేటలో రెండు, యాదాద్రిలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు మొక్కలు ఇస్తున్నారు. మొక్క ఖరీదు రూ.193 కాగా, రాయితీపై రూ.20కే ఇస్తున్నారు.

రైతులకు నికర ఆదాయం..

ఆయిల్పామ్ సాగు రైతులకు మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా చేయడంతో పాటు రెండు, మూడు గ్రామాలకు కలిపి కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి కం పెనీలు రైతుల వద్ద నుంచి దిగుబడులను కొనుగోలు చేస్తున్నాయి. 10 నుంచి 14 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమచేసేలా ఏర్పాటుచేయడంతో రైతులు నికర ఆదాయం పొందుతున్నారు.

జిల్లాలకు కేటాయించిన కంపెనీలు నర్సరీలు పెంచి, రైతులకు మొక్కలు అందజేయడమే గాక, ప్రతి నెలా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు దిగుబడులు కొనుగోలు చేయడంతో రైతులకు గిట్టుబాటు లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. టన్నుకు ప్రస్తుతం రూ.12,627 రైతులకు కంపెనీలు చెల్లిస్తున్నాయి. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 2,500 ఎకరాల్లో రైతులు దిగుబడి సాధిస్తున్నారు.

ధరల గ్యారెంటీతో పెరిగిన సాగు 

ఆయిల్పామ్ దిగుబడులకు నికరమైన ధర అందుతోంది. ప్రభుత్వం పంట దిగుబడి వచ్చే వరకు రైతులకు ఇన్పుట్స్ సబ్సిడీ ఇస్తోంది. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఈ సాగుపై ఆసక్తి కలిగిన రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలకు రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తున్నాం. లాభాలను ఆర్జించే రైతులను చూసి ఆయిల్ పామ్సాగుకు మరికొందరు రైతులు ముందుకు వస్తున్నారు.

 పిన్నపు రెడ్డి అనంతరెడ్డి  నల్లగొండ జిల్లా ఉద్యాన, పట్టు శాఖాధికారి