26-07-2025 12:35:36 AM
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు
భద్రాద్రి కొత్తగూడెం, జులై 25, (విజయ క్రాంతి) కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను కొత్తగూడెం క్లబ్లో, పాల్వంచ కనకదుర్గ ఫంక్షన్ హాల్ నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న పేదవారి కల నేడు సాకారమైందన్నారు. గత ప్రభుత్వ కాలంలో రేషన్ కార్డుల పంపిణీ ఆగిపోవడంతో పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమర్థంగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందన్నారు.
ఇప్పటి వరకు కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,633 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా 7,962 కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు జతపరచడం జరిగిందన్నారు. కొత్తగూడెం మండలంలో ప్రత్యేకంగా 1,733 కొత్త కార్డులు మంజూరు కాగా, 2,188 కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు చేర్చారు. ఇంకా దాదాపు 2,000 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, 600 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు.
పాల్వంచ మం డల పరిధిలో నూతనంగా 1,727 , కుటుంబ సభ్యుల వివరాలు జతపరిచినవి 3,584 కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు.గతంలో దొడ్డు బియ్యంతో పేదలకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం నాణ్యతతో పాటు, వారి ఆకలిని తీర్చడమే కాక, ఆర్థికాభివృద్ధికి దోహద పడుతోందన్నారు.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.
కొత్తగూడెం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేశాం. తక్కువ సమయంలోనే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, మంజూరు ప్రక్రియ చేపట్టాం. అలాగే, కుటుంబ సభ్యుల వివరాలను కూడా సమగ్రంగా నవీకరణ చేశామన్నారు.ప్రభుత్వం పేదవారి కోసం సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకొని వారు ఆర్థికంగా ముందు కెళ్లాలన్నారు.
అనంతరం శాసన సభ్యులకు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పా టిల్ చేతుల మీదుగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారిని రుక్మిణి, సంబంధిత శాఖల అధికారులు, రేషన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.