25-07-2025 11:10:40 PM
హాలియా,(విజయక్రాంతి): జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం దొంగ దారి ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర బైక్ దొంగల ముఠాను హాలియా, త్రిపురారం పోలీసులు పట్టుకొని కటకటాలలోకి నెట్టడమే కాకుండా వారి నుండి సుమారు రూ.25 లక్షల విలువచేసే సైకిల్ మోటార్ లు బంగారం స్వాధీనం చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం సాయంత్రం హాలియా పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇట్టి విషయాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామానికి చెందిన యువకులు శ్రీను, నాగరాజు లు నల్లగొండ జిల్లా హాలియా బస్టాండ్ తో పాటు పలు పార్కింగ్ ప్రదేశాల్లో ఉంచిన బైక్ లను చాకచక్యంగా తాళాలను తొలగించి చోరీకి పాల్పడుతున్నట్లుగా ఆయన వివరించారు.
వీరితోపాటు అడవి దేవులపల్లి మండలానికి చెందిన ముగ్గురు దామరచర్ల మండలానికి చెందిన ముగ్గురు యువకులతో పాటు హైదరాబాద్ కు చెందిన మరో యువకుడు వివిధ ప్రాంతాల్లో బైక్ ల చోరీకి పాల్పడి విక్రయించి సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కాగా హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు కేసుల్లో 10 బైకులను స్వాధీనం చేసుకోగా త్రిపురారం పోలీస్ స్టేషన్ పరిధిలో 12 కేసుల్లో మరో 10 బైకులను స్వాధీనం చేసుకోవడంతో పాటు రెండు తులాల బంగారం, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అధిక కేసుల్లో నిందితులుగా ఉన్న యువకులపై పీడియాక్ట్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. వీటితోపాటు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సైతం చైన్ స్నాచింగ్ ఇతర దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది పేర్కొన్నారు.
ఇట్టి కేసుల్లో పట్టుబడ్డ నిందితులను రిమాండ్ కు తరలించి కస్టడీలోకి తీసుకుని నేరాల వివరాలపై విచారణ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా హాలియా పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహించిన హాలియా సీఐ సతీష్ రెడ్డిని అభినందించారు.ఇట్టి కేసుల దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ కు రివార్డును అందజేశారు. ఆయనతోపాటు సిబ్బంది రమేష్ గౌడ్, సురేష్, హరి ప్రసాద్, శ్రవణ్, శివరాజ్, సుభాష్, రైటర్ కృష్ణ లకు ఎస్పీ రివార్డులను అందజేసి అభినందించారు. సమావేశంలో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఆయా పోలీస్ స్టేషన్ ల సిబ్బంది పాల్గొన్నారు.