21-06-2024 12:05:00 AM
గంగను జీవనదిగా పిలుస్తారు.. పావనిగా కొలుస్తారు.. ఆ జీవనవాహిని ఉండాల్సిన చోట నీటి చెమ్మ కూడా కానరాకపోతే? కాశీని భూమ్మీద అత్యంత పురాతన నగరంగా చెప్పుకుంటారు.. అలాంటిది అక్కడ ఇక బతుకు సాగించ లేని పరిస్థితి ఎదురైతే?! ఊహించడానికి కూడా కష్టతరంగా అనిపించే ఈ విషయాలన్నీ వాస్తవాలే అన్నరీతిలో తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.
ఆయన దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ నేపథ్యంలోనే సాగనున్నట్టు ఇటీవల చెప్పుకొచ్చారు. భారీ తారాగణం, నిర్మాణ వ్యయాలతో రూపొందిన ఈ సినిమా విడుదలకు చేరువవుతున్న తరుణంలో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వీడియో రూపంలో ప్రేక్షకులతో పంచుకుంటున్న ఆయన, కొంతకాలం నుంచి అందరూ ఆరాతీస్తున్న కల్కి కథ గురించి తాజాగా చెప్పుకొచ్చారు.
“భూమి మీద మొదటి నగరం.. ఇప్పుడు ప్రపంచంలో ఆఖరి నగరం అనే ఆలోచనలో నుంచి ఈ సినిమా కథ పుట్టుకొచ్చింది. పురాణాల్లో కాశీ ప్రాచీనమైన నగరమన్న ప్రస్తావన ఉంది. నాగరికత మొదలైంది కూడా ఇక్కడే అని చెబుతారు. కలియుగాంతంలో గంగ ఎండిపోయిన తర్వాత ఆఖరి నగరంగా కాశీ ఉంటే.. మూడు వేల సంవత్సరాల తర్వాత ఆ నగరంలోని పరిస్థితులు ఎలా ఉంటాయని ఆలోచించి, అప్పటికి వాడుకలో ఉండే వనరులైన డబ్బు, వాహనం వంటి వాటిని ప్రత్యేకంగా రూపొందించాం. మరోవైపు వనరులన్నీ అంతరించిన పోయిన కాశీ నగరం పైన పిరమిడ్ ఆకారంలో స్వర్గాన్ని పోలిన ఒక సరికొత్త ప్రపంచం ఉంటుంది.
అదే కాంప్లెక్స్. అక్కడ లేనిదంటూ ఉండదు. ఇందులో మూడో ప్రపంచమూ ఉంది. దాని పేరు శంబాల. ‘కల్కి’కి ఇది ఎంతో కీలకం. కల్కి అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు కూడా అదే. కాశీకి, కాంప్లెక్స్‌కి సంబంధం లేని ఈ ప్రదేశంలో ఉన్నవాళ్లంతా కాంప్లెక్స్‌కి వ్యతిరేకంగా ఉంటూ అక్కడి వారితో పోరాడుతుంటారు. అయితే ఇక్కడ దైవానికి మాత్రం చోటు లేదు. ఈ మూడు ప్రపంచాలు మూడు భిన్నమైన సంస్కృతులను కలిగి ఉంటాయి. వస్తువులు, ఆహారం, దుస్తులు, ధనం, ఆయుధాలు, వాహనాలు వేటికవే భిన్నమైనవి” అని కథా వస్తువుని క్లుప్తంగా తెలిపారు. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. సుమారు మూడు గంటల నిడివితో ‘కల్కి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.