17-11-2025 04:36:45 PM
శ్రమదానంతో సూర్య దేవాలయ రక్షణకు యువత ముందుకు..
నకిరేకల్ (విజయక్రాంతి): ‘విజయక్రాంతి’లో వచ్చిన ‘మనసకబారుతున్న కళా వైభవం’ కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆకారం, పెర్కకొండారం, పరిసర గ్రామాల యువత సూర్య దేవాలయం రక్షణకు రంగంలోకి దిగింది. శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయం శిథిలావస్థలో ఉందన్న విషయం యువతను కలచివేసింది. శ్రమదానంతో తొలి దశ పునరుద్ధరణ యువత ఆదివారం ఉదయం పూనుకొని చెట్లను, చెత్త, మట్టి తొలగించారు. గుడి లోపల శుభ్రం చేశారు. కలుపు మొక్కలు తొలగించారు. దీపాలు వెలిగించి నైవేద్యం సమర్పించారు. దీంతో దేవాలయం కాంతులీనింది.
సోషల్ మీడియాలో స్పందన -200 మంది యువత చేరిక
ఉట్కూరు వెంకటేష్ సోషల్ మీడియాలో ఇచ్చిన పిలుపుతో సుమారు 200 మంది యువత సూర్య దేవాలయం శ్రమదానంలో పాల్గొన్నారు. గ్రామస్థులు కూడా చేయూతగా నిలిచారు. బొడ్డు శ్రీను 20,000 రూపాయలతో అన్నప్రసాదం నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమరం రెడ్డి జేసీబీ పంపించి సహకరించారు. వీరితో పాటు అనేకమంది సహాయసహకారాలు అందించారు.
“చరిత్ర రక్షణ మనదే” -యువత సంకల్పం
ప్రతి ఆదివారం శ్రమదానం, దీపనైవేద్యం కొనసాగిస్తామని యువత ప్రకటించింది. సూర్య దేవాలయం పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని ప్రజలు, యువత విజ్ఞప్తి చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న సూర్య దేవాలయాన్ని వెలికి తీసినందుకు విజయక్రాంతి దినపత్రికకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.