calender_icon.png 17 November, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ ‘తారలు’

21-06-2024 12:05:00 AM

వేషాలతో వేన వేల హృదయాలను ఏలారు.. సినిమాల ద్వారా కూడబెట్టిన అభిమాన ధనాన్నంతా రాజకీయ రంగంలో పెట్టుబడిగా పెట్టారు. తెరపై దక్కిన ఆదరణే కొందరికి  రాజకీయాల్లోనూ సొంతం కాగా, మరికొందరి స్టార్‌డమ్ ఇక్కడ పని చేయలేదు. అయినా సినిమాల్లో తారలై మెరిసిన ఎందరో నటులు రాజకీయాల్లో అరంగేట్రం చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాజకీయాల్లో సినీ గ్లామర్‌ది ప్రత్యేక స్థానం. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తాజాగా ప్రముఖ టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జనసేన పేరుతో సుమారు పదేండ్ల క్రితం పార్టీని స్థాపించిన పవర్ స్టార్.. ఏపీ రాజకీయాల్లో ఈ దఫా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కూర్చిన ‘రాజకీయ తారాతోరణమే’ ఇది... 

భారతదేశంలో.. ఇంకా చెప్పాలంటే దక్షిణాదిన సినీ నటులకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. హీరోలను నెత్తిన పెట్టుకొని అభిమానించే ఫ్యాన్స్ వారి రాజకీయ ప్రస్థానానికీ ప్రాణం పోశారు. ఫ్యాన్స్ అభిమానమే ఆలంబనగా ఎందరో నటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవులు అధిష్ఠించిన వారూ ఉన్నారు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్తమాన రాజకీయాల్లో ఈ ట్రెండ్ మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 

రాజకీయాల్లో తారా తోరణానికి ఆద్యుడు ఎంజీఆర్ 

సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తారలకు తమి ళ జనం అగ్రతాంబూలం అందిస్తారు. చిత్రసీమలో ఓ వెలుగు వెలిగి రాజకీయ అరంగేట్రం చేసిన పలువురు నటీనటులు తమిళ రాజకీల్లోనూ సత్తా చాటారు. అయితే, రాజకీయాల్లో తారా తోరణానికి ఆద్యుడు మాత్రం ఎంజీఆర్. వెండితెరపై వెలిగి రాజకీయాలను సైతం శాసించిన వారిలో ముందుగా చెప్పుకోదగ్గ పేరు ఎంజీ రామచంద్రన్. 1936లో సినీ రంగ ప్రవేశం చేసిన చేసిన ఎంజీఆర్ పరిశ్రమ ప్రముఖుల్లో ఎదిగారు. 1987 వరకు నటుడిగా కొనసాగారు. అలా నాలుగు దశాబ్దాల పాటు సినీ నట ప్రస్థానాన్ని కొనసాగించి, ఎంజీఆర్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన 1972, అక్టోబర్ 17న ఎంజీఆర్ అన్నాడీఎంకే పేరుతో పార్టీని స్థాపించారు. 1977 నుంచి 1987 వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ అతి కొద్ది కాలం సీఎంగా కొనసాగారు. 

జయలలిత :  తమిళ రాజకీయాలను శాసించిన మరో సినీ తార జయలలితనే. ఈమె పూర్తి పేరు జయరాం జయలలిత. తమిళ నాడు ముఖ్యమంత్రిగా ఆరు పర్యాయాలు పనిచేశారు. 1960లో బాల నటిగా తన నట జీవితాన్ని ప్రారంభించి, 1965లో ప్రధాన పాత్రలో తొలిసారి నటించారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 650 చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. 1982లో తన అత్యంత విజయవంతమైన కోస్టార్ ఎంజీఆర్ సహాయంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎంజీఆర్ పార్టీ అయిన అన్నాడీఎంకేలో చేరారు. ఎంజీఆర్ మరణానంతరం జయలలిత చేతుల్లోకి పార్టీ పగ్గాలు వెళ్లాయి. తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆమె తమిళ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. 1991 2001, 2002 2011 2015 16 మధ్య కాలంలో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 

కరుణానిధి : డీఎంకే పార్టీ తరఫున చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి సినీ సంభాషణల రచయితగా, కథా రచయితగానే రాజకీయాల్లో అడుగు పెట్టారు. కరుణానిధి పెద్ద కొడుకు ముత్తు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. ప్రస్తుత కరుణానిధి మనవడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోపాటు ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ సైతం పలు చిత్రాల్లో హీరోగా నటించారు. 

కెప్టెన్ విజయ్ కాంత్: మరో ప్రముఖ తమిళ స్టార్ విజయ్ కాంత్ ‘దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం’ (డీఎండీకే) పేరుతో 2005లో రాజకీయ పార్టీని స్థాపించారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన పార్టీకి ఒకే ఒక్క సీటు లభించింది. విజయం సాధించిన ఆ ఒక్క వ్యక్తి కూడా విజయ్‌కాంతే. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసిన డీఎండీకే 40 స్థానాల్లో బరిలోకి దిగితే ఏకంగా 29 స్థానాలను గెలుచుకుంది. మళ్లీ 2016, 2021 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో ఎంఐఎం తదితర పార్టీలతో పోటీ చేసిన విజయ్‌కాంత్ పార్టీ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయిం ది. కొంత కాలం క్రితం అనారోగ్య కారణాలతో విజయ్‌కాంత్ కన్నుమూశారు. ప్రస్తు తం పార్టీ వ్యవహారాలను ఆయన భార్య ప్రేమలత చూస్తున్నా రు. సినీ పరిశ్రమలో కెప్టెన్ విజయ్ కాంత్‌గా పేరు పొందిన 2011 లో ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా పనిచేశారు. 

నెపోలియన్ : రంగస్థల పేరు ‘నెపోలియన్’గా సుపరిచితుడైన కుమరేశన్ దురైసామి.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ భాషా చిత్రాల్లో నటించారు. 1961లో సినీరంగ ప్రవేశం చేసిన నెపోలియన్ 2019 లో తన మొదటి హాలీవుడ్ చిత్రం ‘డెవిల్స్ నైట్ : డాన్ ఆఫ్ ది నైస్ రూజ్’లో నటించారు. డీఎంకే ద్వారా రాజకీయాల్లో చేరిన ఆయన 2009 నుంచి 2013 మధ్య మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. 

కమలహాసన్: ప్రముఖ స్టార్ కమలహాసన్ అసలు పేరు పార్థసారథి శ్రీనివాస్. 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని లాంచ్ చేసి, రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడుకు చెందిన స్వాతంత్య్ర సమర యోధుడి కుమారుడైన కమలహాసన్ 1960లో ఆరేండ్ల ప్రాయంలోనే బాల నటుడిగా కెరీర్ ఆరంభించారు. అప్పటి నుంచి ‘ఉలగనాయగన్’ అనే పేరుతో సుపరిచితుడైన ఆయన ఆరు దశాబ్దాల కెరీర్‌లో వివిధ భాషల్లో ఇప్పటివరకు 231కి పైగా చిత్రాల్లో నటించారు. తమిళనాడుతోపాటు పుదుచ్చేరి రాజకీయాల్లోనూ కమలహాసన్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 

దళపతి విజయ్ : తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన ఇళయ దళపతి విజయ్ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో ఆయన పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోమని ముందే చెప్పిన విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని ప్రకటించిన విషయం విదితమే. 

తమిళ నాట మరికొందరు... 

‘ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి’ పేరుతో 2007లో సినీ నటుడు శరత్ కుమార్ ఈ పార్టీని వ్యవస్థాపించారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన ఈ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది. ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేశన్ ప్రారంభించిన ‘తమిజగ మున్నేట్ర మున్నాయ్’ (టీఎంఎం)పార్టీ కొంత కాలమే ఉనికిలో ఉంది. 1988లో ఆయన దీన్ని స్థాపించగా, కేవలం ఏడాది కాలంలోనే ఈ పార్టీని ఎత్తివేశారు. తమిళనాడుకు చెందిన సినీ నటుడు కార్తీక్ ‘అహిల ఇండియా నాదులమ్ కట్చి’ (ఏఐఎన్‌ఎంకే) పార్టీని 2009లో నెలకొల్పారు. పార్టీ మద్దతుదారుల్లో ఆయన అభిమానులే ఎక్కువ. 

తెలుగు నాట ఎన్టీఆర్... 

తెలుగు తారలు రాజకీయాల్లోకి ప్రవేశించే సంప్రదాయపు ఆద్యుడిగా ఆ కీర్తి.. వెండితెరను ఏలిన మహాన టుడు నందమూరి తారక రామారావుకే దక్కిం ది. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ గురించి తెలు గు ప్రజలందరికీ తెలిసిందే. 1983, 1984, 1994లో ఆయన మూ డు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయన 1983లో పార్టీని నెలకొల్పగా, 8 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన రికార్డు ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు.  

చిరంజీవి : ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి 2008లో స్థాపించారు. ఆ తర్వాత 2011లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2009 మధ్య తిరుపతి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2012లో రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కల్చర్, టూరిజం శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. 

విజయశాంతి : అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునలతో నటించిన ప్రముఖ నటి విజయశాంతి సైతం ‘తల్లి తెలంగాణ’ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. తర్వాత ఆ పార్టీని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్)లో విలీనం చేశారు. ఒకసారి టీఆర్‌ఎస్ తరఫున మెదక్ ఎంపీగా గెలుపొందిన విజయశాంతి తర్వాత కాం గ్రెస్, బీజేపీల్లోకి మారుతూ వచ్చారు. గ్లామర్ హీరోయిన్‌గానే కాక యాక్షన్ స్టార్‌గానూ మెప్పించారు విజయశాంతి. ఆమె నట కిరీటంలో పొదగబడిన కలికి తురాయిల్లో చెప్పుకోదగ్గది ‘లేడీ సూపర్ స్టార్’ అనే పేరు. 

పాలిటిక్స్‌లో ‘పవర్’ స్టార్ 

తన సోదరుడు చిరంజీవి బాటలోనే పవన్ కల్యాణ్ నడిచారు. పార్టీ స్థాపించిన ఏడాదే టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. తర్వాత 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బహుజన సమాజ్ పార్టీతో కలిసి బరిలోకి దిగారు. తాజా ఎన్నికల్లో పవన్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోని 21 స్థానాల నుంచి బరిలోకి దిగింది. పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ విజయ ఢంకా మోగించి ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వ మార్పు వెనుక ఉన్న కారణాల్లో పవన్ కల్యాణ్ పనితీరు కూడా ఒకటి అని చెప్పవచ్చు. 2014లో పవన్ కల్యాణ్ సారథ్యంలో జనసేన ఆవిర్భవించిన విషయం తెలిసిందే. 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో హీరోగా పరిచయమయ్యా రు. ‘గోకులంలో సీత’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలు చెప్పుకోదగ్గవి. ఇంకా పవన్ కల్యాణ్ సైన్ చేసిన ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాలు రావాల్సి ఉంది. 

ఊరించి వెనక్కి తగ్గిన రజనీకాంత్ 

తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన రజనీకాంత్ అభిమానులను ఊరించి ఉసూరుమనిపించారు. రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించి, చివరకు చేతులెత్తేశారు. రాజకీయాల్లోకి రావటం లేదని ప్రకటించారు.