21-06-2024 12:05:00 AM
‘మద్రాస్ కేఫ్’ నుంచి సరాసరి విశాఖలోని సముద్రం ఒడ్డుకొచ్చి తన ఊహలన్నిటినీ గుసగుసలుగా చెప్పిన ప్రభావతి గుర్తుందా? ఎవరామె అనేరు..! ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరపైకి వచ్చిన రాశీఖన్నా. అప్పటికి నటుడిగా అలరిస్తున్న అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ తొలి చిత్రానికి నిన్నటితో పదేళ్లు నిండాయి. ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైన రాశీ ఖన్నా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా జ్ఞాపకాల్లోకి వెళుతూ “అప్పుడప్పుడే నా కెరీర్ ఆరంభమైంది. అందులోనూ ఇది నా మొదటి తెలుగు సినిమా. హీరో నాగశౌర్య వెనక కూర్చుంటే నేను బైక్ నడిపే సన్నివేశాలు కొన్ని ఉంటాయి.
తొలిసారి బైక్ ఎక్కేటపుడు శౌర్య నా వైపు కొంచెం అనుమానంగా చూశాడు. అది గమనించి ‘బానే నడపగలను’ అని నమ్మకంగా చెప్పాను. అయితే బండి ముందుకు వెళుతూ.. సడెన్‌గా పడిపోయింది. అలా ఒక్కసారే కాదు. ఈ సినిమా కోసం బండి నడిపిన ప్రతి సన్నివేశంలోనూ దాదాపు ఇలానే జరిగింది. దాంతో శౌర్యపై నేను హత్యాయత్నం చేస్తున్నానంటూ కొంతమంది నన్ను ఆట పట్టించారు” అంటూ నాటి సంగతులను నెమరు వేసుకుంది ఈ ఢిల్లీ భామ. తొలి సినిమాతోనే కుర్రకారుల హృదయాల్ని ‘జిల్’ మనిపించిన రాశీ, ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ సినిమాతో పాటు మరికొన్ని హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది.