calender_icon.png 8 June, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్ద్రుష్టులు

05-05-2025 12:00:00 AM

ఒక సంకర్షణ, ఒక సంఘర్షణ

వేలవేల పరిశోధనా తపస్సులు

అభిజ్ఞా నైపుణ్యాలలో 

మానవమేధ శిఖరమెక్కుతోంది

స్వీయ దిద్దుబాట్లు లేనిచోట

నియంతచూపుల డేగదాడులు తప్పవు

మనిషిని అనంతంగా మెచ్చుకోవాలో 

అసలు మనిషినే మరచిపోవాలో..

ఏదో నిగూఢ గవాక్షం తెరుచుకుంటుంది

పునఃప్రతిష్టితం అద్భుతకార్యం కావచ్చు

నిర్జీవ ప్రతిమలు మానవాళిని

మంత్రదర్పణం ముందు 

నిలుపుతాయి చూడు

ఏఐ బూమ్‌నుంచి మేలును వెతుక్కుంటున్న

మనిషి.. అస్తిత్వ ఆనవాళ్లను కోల్పోతూ

పునరావృత సమస్యల ఛేదనలో

చీకటి శరణాలయంలో నిలిచి దుఃఖించవచ్చు

నీ దైనందిన జీవితంలో భాగమై

సిరి, అలెక్సాలు నీకే పాఠం చెబుతాయి

స్వయంచాలకంగా నీనుంచే సంగ్రహించి

అన్ని ఆటల్ని అదే ఆడేస్తుంది

నిస్తేజమై నువ్వు చూస్తూ వుండిపోవాలి

ఓ స్ఫురద్రూపీ ... ఓ విధాతా...

నీచే మలచబడ్డ కృత్రిమమేధ

స్వేద బిందువులు తొడగదని 

చప్పట్లు కొట్టు

కళ్ళు తెరిచే కొత్త ప్రపంచంలోకి దూకు 

బహుళ పొరల న్యూరాన్లు చుట్టు ముడతాయి

ప్రయోజనాలు, అప్రయోజనాలు అన్నీ

కలగా పులగమై నిన్ను మింగేస్తాయి చూడు

ఒక్కటి బాగా గుర్తు పెట్టుకో మానవా...

నువ్వే క్రియేటర్... నువ్వే డిస్ట్రాయర్!

 డా.కటుకోఝ్వల రమేష్