calender_icon.png 8 June, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక పిల్లి - మరొక పులి

05-05-2025 12:00:00 AM

అప్పుడే పులి కళ్ళలోని క్రౌర్యం

మరుక్షణమే వెనుకడుగు 

పిల్లిలాంటి భయకంపిత స్వభావం

ఏకకాలంలో నీ, నాలో

ఒకే ఒరలో భార్యాభర్తల్లా

సర్దుకు సహజీవనం చేస్తుంటాయి

నిన్ను నమ్మి విశ్వాసంతో

కదనరంగంలోకి ముందుకు దూకితే

ముందట ఉన్నోని

మూతిపండ్లు రాలుతాయి

స్వగతంలో ఒకమాట 

వేదికపై ఇంకొక గొంతెత్తే పాట

చెట్టు ఎక్కించి చేతులు విడిచి పెట్టడం

నీకు తెలుసు

నీళ్లు ఏవో పాలు ఏవో

వాడు నందిని పంది అంటే

వంచుకొని తల ఊపుతావు

వాడు పందిని నంది అంటే

బేరీజు వేసుకొని అవుననీ చెపుతావు

ఆగ్రహంగా కుక్కతోక పట్టుకుని

ఉగ్ర గోదావరి ఈదడం వల్ల కాదు

ఒకే సమయంలో

ఒక శత్రువు ఒక మిత్రుడు

నీలో నివసిస్తుంటాడు

తోడు అవుతానని నీడవుతానని

బహిరంగంగా పిలుపు ఇస్తే

పిడికిలెత్తి నిరసన తెలుపలేవు

అడుగు కలిపి ఊరేగింపుతో 

నడువలేవు

నీ కోపమంతా తాటాకు మంట

ఒకే పొల్లు తాలు పంట

నీలో నాలో ఏకకాలంలో

ఒక పిరికి పిల్లి  

ఒకానొక గర్జించే పులి

పదును లేని కత్తుల్లా

సహజీవనం చేస్తుంటాయి

తెలిసి జవాబు చెప్పకుంటే

తల వెయ్యి వక్కలవుతుంది

తెలియక సమాధానం విప్పకుంటే

శవం చెట్టుమీదికి ఎక్కుతుంది

రాజా విక్రమార్కుడు

భుజం మీద శవాన్ని 

మోయడమే కాదు

ఇప్పుడు బతికున్న 

శవాల్నీ మోస్తున్నాడు

ఒక ధారావాహిక

బేతాళ కథ కొనసాగుతూనే వుంటుంది

 జూకంటి జగన్నాథం