calender_icon.png 15 September, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటలు పండించే రైతులకే పెట్టుబడి సాయం

22-07-2024 01:36:34 AM

  1. ఇదే విషయాన్ని విన్నవించిన రైతులు
  2. రాష్ట్రంలో 10 శాతం భూములు సాగుకు పనికి రానివే
  3. ఈ నెలాఖరులోగా అర్హుల జాబితా విడుదల 

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): రైతు భరోసాకు ఎవరు అర్హులన్న దాని మీద ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. పంటలు పండించే రైతులకే పెట్టుబడి సాయం అందించాలని అనేక మంది రైతులు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో ప్రభుత్వం రైతు భరోసాకు అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేస్తోంది. ముందుగా అనర్హుల లిస్టు ప్రకటించి.. తర్వాత విడతల వారీగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా వ్యవసాయ శాఖ ప్లాన్ చేస్తుంది.

వానాకాలంలో వేసే రైతు భరోసా పూర్తిగా పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే వేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ పూర్తికాగానే నెలాఖరు నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 7500 చొప్పన రైతు భరోసా ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా జూన్‌లో అందించే పెట్టుబడి సాయం జూలైలో కూడా రాకపోవడంతో స్ధానిక అధికారులను రైతులు నిలదీస్తున్నారు. దీంతో వారంతా ప్రభుత్వ పెద్దలకు రైతుల సమస్యల గురించి వివరించడంతో రుణమాఫీ తరువాత భరోసా ప్రారంభించేందుకు వివరాలు సిద్ధం చేసుకోవాలని సూచించారట.

దీంతోనే అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే గుట్టలు, రోడ్లు, ప్రైవేటు వెంచర్లు, వ్యాపార కార్యక్రమాలకు వినియోగించే భూముల సర్వే నెంబర్లు జాబితా నుంచి తొలగించినట్లు, వీటికి తోడు  సర్కార్  ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల పేర్లను కూడా రైతు భరోసా లిస్టు నుంచి తొలిగించినట్లు వెల్లడించారు. క్యాబినెట్ సబ్ కమిటీ  జిల్లాల వారీగా ఈనెల 16 వరకు పర్యటించి రైతు భరోసా ఏవిధంగా అమలు చేయాలనే రైతులను అభిప్రాయాలు తీసుకోవడంతో వాటి ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

10 శాతం భూములు పనికిరావు 

ధరణిలో నమోదైన భూముల్లో సుమారు 10 శాతం సాగుకు యోగ్యతలేని భూములేనని అధికారులు గుర్తిం చారు.  స్ధానిక వ్యవసాయశాఖ అధికారులు సర్వే చేస్తే పట్టణ ప్రాంతాల్లో  పాటు మండల కేంద్రాల్లో గత 20 ఏళ్ల  నుంచి వెంచర్లు చేసి విక్రయాలు జరిపారు. అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. అయినా ధరణిలో వారికి పట్టా పాసుబుక్‌లు రావడంతో పంట పండించే రైతులుగా పెట్టుబడి సాయం పొందారు. ఇళ్ల నిర్మాణాలు జరిగినవి సుమారు 3.50 లక్షల ఎకరాల వరకు ఉంటాయని గుట్టలు, రహదారులు, పడావు భూములు మరో 2.50 లక్షల ఎకరాల వరకు ఉండే అవకాశం ఉంది.