calender_icon.png 15 September, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నక్స ల్స్ రహిత దేశంగా భారత్?

29-06-2025 12:00:00 AM

రానున్న 2026 మార్చి ఆఖరినాటికి దేశంలో మావోయిస్టుల ఉనికి అనేది లేకుండా చేయటమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించినట్లు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తెగేసి మరీ చెప్పటం పరిశీలిస్తే ఆ నిర్ణయం తిరుగులేనట్లు తేలిపోయిందని చెప్పక తప్పదు. ఈ మేరకు వర్షాకాలంలోనూ నక్సల్ అణచివేత కూంబింగ్ చర్యలు కొనసాగుతాయ ని ఇటీవల ఛత్తీస్‌గడ్‌లో పర్యటించిన మం త్రి అమిత్ షా పేర్కొన్నారు కూడా.

ఈ ఏరివేతలో భాగంగా ఈనెల 26న ఉదయం ఛత్తీస్‌గఢ్‌లో నారాయణ్‌పూర్ జిల్లాలో భ ద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు ల మాడ్ డివిజన్‌కు చెందిన పెద్ద క్యాడర్ ఉనికి గురించి పోలీసులకు సమాచారం అందడంతో అభుజ్మాద్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు బస్తర్ రేంజి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి.సుందర్‌రాజ్ వెల్లడించటం పరిశీలిస్తే  నక్సల్ అణచివేతపై కేంద్ర ప్రభుత్వ కఠిన వైఖరి అర్థమవుతున్నది.

కాగా గత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో వారిని ఏరి వేసేందుకు జనవరి 2024 నుంచి కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రారంభించిన ఆపరేషన్ కగార్ (ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్)తో ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోను, ఏఓబీలతోపాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు 400 మందికి పైగా మావోయిస్టులను కాల్చి చంపాయి. ఈ ఆపరేషన్‌లో కేంద్ర సీఅర్‌పీఎఫ్, సైన్యం, కోబ్రా బెటాలియన్‌తోసహా పలు భద్రతా దళాలు పాల్గొన్నారు. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి వారి రహస్య ప్రదేశాలు, ఆయుధాలు, ఇతర ఆయుధాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

70వ దశకంలోనే బీజాలు

గత మే 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నారాయణపూర్ జిల్లాలో సీపీఐ(మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు మరణించిన వారిలో వున్నారు. నక్సలైట్ అనే పదం పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరి గ్రామం పే రు నుంచి ఉద్భవించింది. 1967లో ఆ గ్రామంలో  రైతుల తిరుగుబాటు జరిగిం ది. ఈ ఉద్యమాన్నే ‘నక్సలిజం’ అన్నారు.

అదే సంవత్సరం 1967లో, చారుమజుందార్, కానుసన్యాల్, జంగల్ సంతల్ నేతృ త్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) వర్గం సిలిగురి గ్రూప్ అనే పేరుతో, చైనా కమ్యూనిస్ట్ విప్లవం మాదిరిగానే భారతదేశంలోనూ  దీర్ఘకాలిక ప్ర జాయుద్ధాన్ని కొనసాగించాలని ఆ మేరకు మజుందార్ చారిత్రక 8 పత్రాలను రాసుకున్నారు. ఇదే నక్సలైట్ ఉద్యమానికి పునా దిగా మారింది.

నవంబర్ 1967లో, సుశితల్ రే చౌదరి నేతృత్వంలోని ఒక బృం దం ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రివల్యూషనరీస్‌ను నిర్వహించింది. మావో జెడాంగ్ ఈ ఉద్యమా నికి సైద్ధాంతిక ప్రేరణను అందించాడు. భారతీయ రైతులు, దిగువ తరగతి గిరిజనులతో కలిసి బలవంతంగా ఉన్నత వర్గా ల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆయన వా దించారు. మజుందార్ రచనలద్వారా వ్యా పించిన ఈ భావజాలం పట్ల చాలామంది పట్టణ ప్రముఖులూ ఆకర్షితులయ్యారు. 

ఈ రచనలు మావో, కార్ల్ మార్క్స్, వ్లాదిమిర్ లెనిన్ వంటి కమ్యూనిస్ట్ నాయకులు, సిద్ధాంతకర్తల అభిప్రాయాల నుంచి రాయబడ్డాయి. ఉద్యమం ప్రారంభ సంవత్సరాల్లో, ఒక ఉద్యమకారుడి నియామకం ముఖ్య లక్షణాలు నిస్వార్థత, స్వీయ త్యాగం చేసే సామర్థ్యం అని  చారు మజుందార్ నమ్మాడు. అటువంటి నిర్దిష్ట వ్యక్తిత్వాన్ని ఉత్పత్తి చేయడానికి, సంస్థ  విద్యార్థులు, యువతను అధికంగా నియమించుకుంది.

ఈ కొత్త తిరుగుబాటుదారులలో విధేయ త, విప్లవాత్మక వ్యక్తిత్వాన్ని పెంపొందించడంతోపాటు నక్సలైట్లు ఇతర కారణాల వల్ల కూడా యువతను ఎంచుకున్నారు. వీ రు ఎక్కువగా విద్యార్థులు, విద్యావంతులైన యువతను చేర్చడం అవసరం. ఎం దుకంటే వారు మావో జెడాంగ్ కమ్యూనిస్ట్ బోధనలను వ్యాప్తి చేయడంలో పా ల్గొంటారు. వారి స్థావరాన్ని విస్తరించడానికి, ఉద్యమం ఈ విద్యార్థులపై ఆధా రప డింది.

కమ్యూనిస్ట్ తత్వాన్ని చదువురాని గ్రామీణ, శ్రామిక- వర్గాలకు కూడా వ్యాప్తి చేయడానికి దీనిని ఉద్దేశించారు. రైతులు, శ్రామిక వర్గాలతో తమను తాము ఏకీకృతం చేసుకోగల యువతను నియమిం చుకోవడం అవసరమని, ఈ దిగువ తరగతి వర్గాల మాదిరిగానే జీవించడం, పనిచేయడం ద్వారా ఈ నియామకాలు గ్రామాలకు, పట్టణ కేంద్రాలకు కమ్యూనిస్ట్ బోధనలను తీసుకెళ్లగలవని మజుందార్ విశ్వసించాడు. 

క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్ అనేది 1986లో పార్టీ లోపల, పార్టీ రక్షించడానికి లక్ష్యంగా పెట్టుకున్న గిరిజన గ్రామాలలో మహిళలపై తీవ్ర అసమానతను అంగీకరించిన ఫలితంగా ఏర్పడిన అనుబంధ  స్త్రీవాద సంస్థ. వారు రైతుల హక్కులతోపాటు బలవంతపు వివాహం, ద్విభార్యత్వం, హింస అనే గిరిజన సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

అయితే, 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి, అప్పటి హోం మం త్రి జానారెడ్డి ద్వారా మావోయిస్టులను శాంతిచర్చలకు ఆహ్వానించగా, అంగీకరించిన కొన్ని గ్రూపులు హైదరాబాద్‌లోనే మంజీరా అతిథి గృహంలో బసచేసి ప్రభుత్వంతో సుమారు మూడుఊ నాలుగు రో జులు చర్చలు జరిపారు. అదే మావోయిస్టులు చేసిన చారిత్రిక తప్పిదమని అంటా రు కొందరు పరిశీలకులు. ఆ సమయం లో వారిని కలిసేందుకు వచ్చిన బంధువు లు, సానుభూతిపరుల వివరాలను ప్రభు త్వం సేకరించి అణచి వేసిందని అంటారు. 

ఆధునిక ఆయుధాల సేకరణలో!

2011లో చైనా ప్రభుత్వం ఉద్యమ నాయకులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్ ఐఎస్‌ఐ కూ డా ఆర్థిక సహాయం అందిస్తోందని  భార త పోలీసులు ప్రకటించారు. సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన నిపుణి గుప్త తన పరిశోధన ప్రకారం మావోయిస్టులు తమ ఆయుధాలను వివిధ మార్గాల ద్వారా పొందుతారని, వారు విముక్తి పొందిన మండలాలు, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా వంటి అడవుల ప్రాంతాల నుంచి పన్ను వసూలు ద్వారా తమ నిధులను పొందుతారని తెలుస్తుంది.

స్థానిక రాజకీయ నాయకులు కూడా నక్సల్స్‌కు లెవీలు చెల్లిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. కొండ ప్రాంతాల కారణంగా, సరిహద్దులు తక్కువగా ఉండటం వల్ల భారతదేశానికి నేపాల్ (బహుశా అక్కడి ఎంసీసీ ప్రభుత్వం కారణంగా), బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి తెచ్చిన ఆయుధాలతోపాటు నక్సల్స్ వద్ద ఉన్న ఆయుధాలలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఆయుధ శాలల నుంచి, భద్రతా దళాల నుండి దోచుకోబడుతున్నవే అని పరిశీలకుల అంచనా.

కొం తకాలంగా, నక్సల్స్ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుని తమ సొంత ఆయుధ తయారీ కర్మాగారాలను నెలకొల్పి ఆయుధాలు తయారు చేయడం ప్రారంభించారన్న సమాచారమూ ప్రభుత్వం వద్ద వుంది. 

ఇదే ఆఖరి పోరాటం!

కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ ఉనికిని పూర్తి గా నిర్మూలించి వచ్చే 2026 మార్చి నాటి కి భారత్‌దేశాన్ని నక్సల్ రహిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు ఆపరేషన్ కగార్‌ని  ఆఖరి పోరాటంగా రంగంలోకి దించింది. అన్ని విధాల ఆయుధాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, హెలికాప్టర్లు భారీగా సరఫరా చేసి భారీ సంఖ్యలో వివిధ రక్షణ బలగాలకు చెందిన ఆరితేరిన బృందాలను కేటాయించారు.

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన తెలంగాణ, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని అరణ్యప్రాంతాల్లోని గుట్టలపైన దాడులు, సర్చ్ ఆపరేషన్‌లు ముమ్మరం చేయటంతో మావోయిస్టులు గుక్క తిప్పుకోలేక పోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు లొంగి పోతామని వస్తున్న వార్తలు కూడా విదితమే.

ఏది ఏమైనా 2026 మార్చి ఆఖరినాటికి దేశంలో మావోయిస్ట్ ఉనికే ఉండకుండా చేసి, నక్సల్ రహిత భారత్‌గా మార్పు చేసేందుకు తమ సంపూర్ణ సామర్థ్యం కలిగిన భద్రతాదళాలు ఆఖరికి వర్షాకాలంలోకూడా సెర్చ్ ఆపరేషన్ నిలపకుండా తుడిచి పెట్టేస్తాయని కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా పదేపదే ప్రకటించటం గమనార్హం. కేంద్ర ఉక్కు పాదం నుంచి ఇక, వారు తప్పించు కోలేరన్నది తేటతెల్లమవుతోంది.

వ్యాసకర్త సెల్: 9491545699