calender_icon.png 13 September, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇషాన్ మెరిసేనా?

03-12-2024 01:31:12 AM

అతడో డైనమైట్. పేలిన ప్రతిసారి ప్రత్యర్థులకు కాలరాత్రులు మిగిల్చే ఆటగాడు. అందుకోసమే రైజర్స్ అతడికి అంత వెచ్చించింది. ఇప్పటికే జట్టులో హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ ఇలా ఉన్న అరవీరభయంకరులకు తోడు ఇషాన్ కూడా రెచ్చిపోయాడో.. ఆ రోజు ప్రత్యర్థి బౌలర్లకు జాతరే.  పాకెట్ డైనమైట్ ఇషాన్ మెరవాలని ఆశిస్తూ.. 

విజయక్రాంతి ఖేల్ విభాగం: వయసు తక్కువే అయినా ఒక్కసారి మొదలెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనబడాలి. వికెట్ల వెనుక పిల్లాడిలా ఉండే అతడు రెచ్చిపోతే మాత్రం అవతలి టీమ్ బౌలర్లు చచ్చిపోవడం ఖాయం. అందుకోసమే అతడిని ఆరెంజ్ ఆర్మీ ఏకంగా రూ. 11.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఏండ్లుగా ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఇషాన్ ఆ జట్టు టైటిల్స్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

అటువంటి ఇషాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇప్పటి వరకు 105 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన కిషన్ 135.87 స్ట్రుక్ రేట్‌తో 2644 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 16 అర్ధ సెంచరీలు బాదిన ఇషాన్ 2025లో కూడా రెచ్చిపోవాలని ఆరెంజ్ ఆర్మీ కోరుకుంటోంది. 

కుదురుకున్నాడా.. 

ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించే లెఫ్టాండర్ ఇషాన్ కిషన్ త్వరగా ఔట్ అయి పోతే ఏమీ కాదు. కానీ ఒక్క సారి అతడు క్రీజులో కుదురుకుంటే మాత్రం ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతూ బౌలర్లను ఊచకోత కోస్తుంటాడు. ఇన్ని రోజులు ఓపెనర్‌గా బరిలోకి దిగిన కిషన్ ప్రస్తుత సీజన్‌లో ఎక్కడ బరిలోకి దిగుతాడో వేచి చూడాలి. కీపర్‌గా కూడా క్లాసెన్ ఉన్న నేపథ్యంలో ఇషాన్‌కు కీపింగ్ చేసే అవకాశం వస్తుందా? లేదా? అనేది చెప్పడం కష్టం

ఇక పరుగుల మోతే.. ప్రత్యర్థులకు వాతే!

ఇప్పటికే సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌లో అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్, నితీశ్ రెడ్డి వంటి హిట్టర్లు ఉన్నారు. పోయినేడాదే సన్ రైజర్స్ బ్యాటుతో విధ్వంసం చేసింది. ఇప్పటికే అత్యధిక స్కోరును బీట్ చేసి కొత్త రికార్డులు రాసిన ఆరెంజ్ ఆర్మీ మరి ఇషాన్ కూడా రెచ్చిపోతే ఇంకా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో జార్ఖండ్ తరఫున ఆడుతున్న ఇషాన్ రెచ్చిపోతున్నాడు.