06-11-2025 01:17:37 AM
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ‘సీఎం గారూ మాతో చర్చిం చండి.. మమ్మల్ని పిలవండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను పరిష్కరించండి. మా ఆలోచనలు కూడా వినాలి’ అని ‘ఫతి’ నేతలు సీఎం రేవం త్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై ప్రభుత్వం వేసిన కమిటీ టైంపాస్ కమిటీ కావొద్దని, కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దని, ఆ కమిటీలో అవసరంలేని వారిని తొలగించి, నిష్ణాతులైన వారిని నియమించాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (ఫతి) ఛైర్మన్ రమేశ్ బాబు, వైస్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ కేఎస్ రవి కుమార్, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశా రు.
ప్రభుత్వం నియమించిన ఆ కమిటీ ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి లు చెల్లించేందుకు కాదని, వచ్చే అకాడమిక్ ఇయర్ కోసమని తెలిపారు. కాలేజీలను బెదిరిస్తున్న సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. రూ. 10 వేల కోట్లలో తక్షణం రూ. 5 వేల కోట్లు ఇస్తేనే కాలేజీల బంద్ విరమించుకుంటామని, లేకుంటే నిరవధిక బంద్‌ను కొనసాగిస్తామని వారు తేల్చిచెప్పారు. ఈనెల 8న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రైవేట్ కాలేజీల అధ్యాపక సాంత్వన సభను ఏర్పాటుచేస్తున్నామని, ఈనెల 11న లేదా 12న పది లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతంలో బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు.
బుధవారం ఎల్బీస్టేడియంలోని ఫతే మైదాన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ‘ఫతి’ నేతలు మాట్లాడారు. నాన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కాలేజీలు మినహా అన్ని కాలేజీ లు గత మూడు రోజులుగా బంద్‌లో పాల్గొంటునాయని, ఉస్మానియా, జేఎన్టీయూ పరిధి లోని పరీక్షలను బహిష్కరించాయన్నారు. ప్రభుత్వం రూ.10 వేల కోట్లలో ఇప్పుడు రూ.5 వేల కోట్లను చెల్లించాలని, మిగిలిన రూ.5 వేల కోట్లను వాయి దాల రూపంలో వచ్చే ఏడాది మార్చి వరకు ఇచ్చేలా రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అప్పుడే చెప్పాం..
ఫీజు రీయింబర్స్‌మెంట్ పెనుభూతమై కాలేజీలకు నష్టాన్ని తెచ్చిపెట్టిందన్నారు. గతం లో తాము ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రత్యేక ట్రస్టు బ్యాంకు ద్వారా ఏడాదికి రూ.4 వేల కోట్లు ఎలా చెల్లించవచ్చునో వివరించామన్నారు. మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వా లని చెప్పడం బాధాకరమని, ఒక నెలలోనే నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వేసిన కమిటీలో కొంత మంది బయటివారిని తీసివేయాలని, ఆర్థిక వేత్తలు, రిజర్వ్‌బ్యాంక్ రిటైర్ అధికారులు, బ్యాంకర్లు, నిష్ణాతులను నియమించాలని డిమాండ్ చేశారు.
సంబంధం లేనివారు, కాలేజీల సమస్యలను అర్థం చేసుకోని పలువురు అధికారులను అందులో నియమించడంతో సమస్య పరిష్కారం కాకపోగా, కాలయాపన జరుగుతుందన్నారు. కమి టీకి తాము సహకరిస్తామని, ఆచరణ సాధ్యమైన సిఫార్సులను చేయాలని చెప్పారు. కాలే జీలపై విజిలెన్స్ దాడులు ఆదేశాలను నిలిపివేయాలని, ప్రభుత్వం తమతో మంగళవారం చర్చలు జరిపినా అవి పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ౪రోజుల్లో సమస్యను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈనెల 11న లేదా 12న పది లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని హెచ్చరించారు.
యూజ్‌లెస్ కాలేజీలంటారా..?
ప్రభుత్వం, కాలేజీలకు సంధానకర్తగా వ్యవహరించాల్సిన సాంకేతిక, కళాశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేనను ఆ బాధ్యతల నుంచి వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. 2,500 కాలేజీలు నిబంధనలు పా టించడంలేదంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ కాలేజీలంటే ఆమెకు చిన్నచూపని, యూజ్‌లెస్ కాలేజీలని తమను అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల బాగోగులు చూడాలి కానీ, కాలేజీలను బెదిరంచడమేంటని నిలదీశారు. ఆమె తీరు సరిగా లేదని, కాలేజీల చెడునుకోరే విధంగా పనితీరుందని, ఆమె ఉన్నంతకాలం సమస్య పరి ష్కారం కాదని, ఆ పదవి నుంచి ఆమెను వెం టనే తొలగించాలని ఫతి చైర్మన్ రమేశ్ డిమాండ్ చేశారు.
కనీసం రూ. వెయ్యి కోట్లు ఇవ్వరా?
ఈ విద్యాసంవత్సరం విద్యకు కేటాయించిన రూ. 24,107 కోట్ల బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు ఇంతవరకు కాలేజీలకు కేటాయించలేదని తెలిపారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం కమిటీ వేయడం ఫతి సాధించిన విజయమన్నారు. సీఎం తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని, తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. తాము క్వాలిఫైడ్ అధ్యాపకులు, పీహెచ్‌డీ చేసిన వాళ్లమని, రాష్ట్రంలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలకు దేశవ్యాప్తంగా మంచి పేరుందన్నారు. దేశంలోని మెజార్టీ ఇంజినీర్లు, డాక్టర్లు ఇక్కడ నుంచే తయారవుతున్నారని వెల్లడించారు.
విద్యాశాఖ మంత్రి లేకనే సమస్య..
మూడు రోజులుగా బంద్ విజయవంతంగా కొనసాగుతోందని, 52 కాలేజీల్లో బీఫార్మసీ పరీక్షలను బహిష్కరించామన్నారు. నాలుగేండ్లుగా ప్రభుత్వం డబ్బులివ్వడంలేదని, విద్యాశాఖ సీఎం వద్ద ఉండడంతో అధికారులు సలహాలు, సూచనలు సరిగా ఇవ్వడంలే దన్నారు. విద్యాశాఖపై సరిగా దృష్టి సారించడంలేదన్నారు. దసరాకు, దీపావళికి బకాయిలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, పది వేల కోట్లలో ఇప్పుడు రూ.50 శాతం, మిగిలిన 50 శాతం మార్చిలోగా ఇవ్వాలని డిమాండ్ చేశా రు. కమిటీ ప్రస్తుత సమస్య కోసం కాదని, కమిటీ పేరుతో తాత్సారం చేస్తే కుదరదని, ప్రైవేట్ విద్యాసంస్థలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ‘ఫతి’ ట్రె జరర్ కొడాలి కృష్ణారావు, కే సునీల్ కుమార్, కే రాందాస్, బీ సునీతరెడ్డి పాల్గొన్నారు.
మూడో రోజూ కాలేజీల మూత
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు కూడా ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు బంద్‌ను పాటించాయి. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 3 నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్‌ను పాటిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బుధవారంం ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, డీఎడ్, నర్సింగ్, లా, పాలిటెక్నిక్, పారా మెడికల్ వంటి సుమారు 1800 కాలేజీలు పూర్తిగా మూసివేసినట్లు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) తెలిపింది. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద లేని కాలేజీలు మాత్రమే నడుస్తున్నాయని పేర్కొంది. ఇదిలా ఉంటే ఈనెల 8న ఎల్బీస్టేడియంలో చేపట్టే లక్ష మంది ప్రైవేట్ కాలేజీల ఉద్యోగుల బహిరంగ సభ సన్నాహాక సమావేశాన్ని నిర్వహించి, ఫీజు బకాయిలు చెల్లించేంత వరకు కాలేజీలు తెరవబోమని తీర్మానించినట్లు ఫతి నేతలు తెలిపారు.