04-12-2024 12:00:00 AM
38 బంతుల్లోనే శతకం l సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన ఉర్విల్ పటేల్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మరోసారి తడాఖా చూపించాడు. ఇప్పటికే టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి రికార్డులకెక్కిన ఉర్విల్ తాజాగా టోర్నీలో రెండో శతకం సాధించాడు.
ఉత్తరాఖండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 38 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఉర్విల్ గుజరాత్‌కు 8 వికెట్లతో ఘన విజయాన్ని అందించాడు. ఇదే టోర్నీలో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 28 బంతుల్లోనే రికార్డు శతకం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
సమర్థ్ (54), తారే (54) రాణించారు. అనంతరం ఉర్విల్ (41 బంతుల్లో 115 నాటౌట్; 8 ఫోర్లు, 11 సిక్సర్లు) మెరుపుల ధాటికి గుజరాత్ 13.1 ఓవర్లలోనే 185 పరుగులు చేసి గెలుపొందింది. గుజరాత్‌కు ఆరు మ్యాచ్‌ల్లో ఇది వరుసగా ఐదో విజయం కాగా.. గ్రూప్ ఉన్న గుజరాత్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
మిగతా మ్యాచ్‌ల్లో సర్వీసెస్‌పై ముంబై జట్టు 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై కెప్టెన్ సూర్యకుమార్, శివమ్ దూబేలు అర్థశతకాలతో అదరగొట్టారు. బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 9 వికెట్లతో, ఢిల్లీపై జార్ఖండ్ 5 వికెట్ల తేడాతో విజయాలను సాధించాయి.