06-11-2025 01:02:32 AM
తొలి ముస్లిం మహిళగా రికార్డు
తల్లి కోఠి ఉమెన్స్ కాలేజీ నుంచి డబుల్ పట్టా
వాషింగ్టన్, నవంబర్ 5 : హైదరాబాద్ మూలాలు కలిగిన గజాలా హష్మీ అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ నేత జాన్ రీడ్‌పై విజయం సాధించి ఈ కీలక బాధ్యతలకు ఎంపికయ్యారు. హష్మీ వర్జీనియా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికైన మొదటి ఆసియా- అమెరికన్‌గా, తొలి ముస్లిం మహిళగా రికార్డు సృష్టించారు. అమెరికాలో ఈ విజ యం సాధించిన మొదటి ముస్లిం మహిళ.
నాలుగేళ్ల వయసులో అమెరికాకు
ఆమె పక్కా హైదరాబాదీ.. ఇక్కడే పుట్టారు. చిన్నతనంలో మలక్‌పేటలోని అమ్మమ్మ తాతయ్య ఇంట్లో నివసించారు. నాలుగేళ్ల వయసులోనే తల్లితో కలిసి అమెరికాలో ఉంటున్న తండ్రి వద్దకు వెళ్లారు. బోధనారంగంలో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి, ఇప్పుడు ఏకంగా వర్జీనియా రాష్ట్ర లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా గజాలా హస్మీ రికార్డు సృష్టించారు. ఇలా హైదరాబాద్ పేరును ఆమె మరోసారి సగర్వంగా నిలబెట్టారు.
మలక్‌పేట్‌లో బాల్యం..
గజాలా హష్మీ జూలై 5, 1964న హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్‌లో ప్రొఫెసర్ జియా హష్మీ, తన్వీర్ హష్మీ దంపతులకు జన్మించారు. ఆమె చిన్నతనంలో మలక్‌పేట్‌లోని తన అమ్మమ్మ తాతయ్యల ఇంట్లో గడిపారు. నాలుగేళ్ల వయసులో తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉంటున్న తండ్రి వద్దకు వెళ్లారు. గజాలా తండ్రి జియా.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. ఆ తరువాత దక్షిణ కెరొలీనా యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పొందారు.
అనంతరం అధ్యాపక వృత్తిలో ప్రవేశించారు. సుదీర్ఘ కెరీర్ అనంతరం సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ఇక గజాలా హష్మీ తల్లి తన్వీర్ హష్మీ, హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీ(ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్) నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆనర్స్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో డబుల్ పట్టా పొందారు. గజాలా హష్మీ తాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విభాగంలో పనిచేశారు. గజాలా హష్మీ అజార్ రఫీక్‌ను వివాహం చేసుకుని 1991 లో రిచ్మండ్ ప్రాంతానికి వెళ్లారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు యాస్మిన్, నూర్- ఉన్నారు.
వీరిద్దరూ చెస్టర్ఫీల్ కౌంటీ పబ్లిక్ స్కూల్స్, వర్జీనియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. ఆమె కుటుం బం 1969లో ఆమెకు నాలుగు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లింది. ఆమె జార్జియాలోని స్టేట్స్‌బరోలో పెరిగింది. ఆమె తండ్రి, మామ జార్జియా సదరన్ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగంలో పనిచేశారు. ఆమె విశ్వవిద్యాలయంలోని మార్విన్ పిట్మన్ లాబొరేటరీ స్కూల్‌లో చదివారు. హష్మీ జార్జియా సదరన్ యూని వర్సిటీలో ఇంగ్లీషులో బ్యాచిలర్ ఆఫ్ ఆరట్స్ పూర్తి చేసి, ఎమోరీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషులో పీహెచ్‌డీ పొందా రు.
గజాలా హష్మీ 25 సంవత్సరాలుగా విద్యావేత్తగా, విద్యా నిర్వాహకురాలిగా ఉన్నారు. ఆమె రిచ్‌మండ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, జె.సార్జెంట్ రేనాలడ్స్ కమ్యూనిటీ కాలేజీలో ప్రొఫెసర్‌గా, అక్కడ ఆమె సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు. భారతదేశంలో పుట్టి జార్జియాలో పెరిగిన హష్మీ 2019, 2023 లో ఆమె వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2025 వర్జీనియా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ నామినీగా, హష్మీ రిపబ్లికన్ నామినీ జాన్ రీడ్‌ను ఓడించారు.