calender_icon.png 6 November, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చకు సిద్ధమా?

06-11-2025 01:25:39 AM

  1. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎంకు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సవాల్
  2. చెత్త ఎవరిదో.. సత్తా ఎవరిదో తేల్చుకుందాం..
  3. వేల కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం కంటే అవమానం ఉంటదా!
  4. ముస్లింలకు సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి
  5. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రగతి నివేదిక విడుదల

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో.. రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా.. అని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవా ల్ విసిరారు. చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేల్చుకునేందామన్నారు. ‘ప్లేస్, టైమ్ వాళ్లు చెప్పినా సరే.. తమను చెప్పమన్నా సరే.. కమాండ్ కంట్రోల్ సెంటరైనా.. గాంధీభవన్ అయినా.. అసెంబ్లీలో చర్చ పెట్టినా చర్చించడానికి మేము రెడీ.. మరి మీరు రెడీనా’ అని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో దమ్ముంటే చర్చకు రావాలన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామనే రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఆయన భాషలో ఆయనకు అర్థమయ్యేటట్లు చెప్పే సత్తా తమకు ఉందన్నారు. కానీ ‘రేవంత్ రెడ్డి మమ్మల్ని తిట్టినా.. మేం మాత్రం గౌరవంగానే మాట్లాడుతాం’ అని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో.. రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించిన ఆయన.. దీంతో చెత్త ఎవరిది.. సత్తా ఎవరిదో తేలిపోతుందన్నారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి తాలూకు ప్రగతి నివేదికను తెలంగాణ భవన్‌లో బుధవారం కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్‌లో 42 ఫ్లు ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించామని, తమ హయాంలో స్టార్ట్ చేసి న వాటికే కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేసిందని వివరించారు.

అవి కాకుండా.. కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డు అయినా నిర్మించారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కొత్త రోడ్ల సంగతి తర్వాత.. కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా అని నిలదీశారు. నగర ప్రజలకు మళ్లీ వాటర్ ట్యాంకర్‌లపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 

ఇప్పుడు మురికి కూపం..

హైదరాబాద్‌లో శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేలాది స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టామని అన్నారు. తమ హయాంలో ప్రతి రోజూ 7.5 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించామని వెల్లడించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 34 అవార్డులు సాధించామని తెలిపారు. బెస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్‌కు అవార్డు వచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడే స్ట్రాటజిక్ నాటా డెవలప్‌మెంట్ ప్రొగ్రా మ్ (ఎస్‌ఎన్‌డీపీ)ని కూడా స్టార్ట్ చేసినట్లు తెలిపారు.

పదేళ్లలో కేసీఆర్ హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా మారిస్తే.. ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మురికికూపంగా మార్చిందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభు త్వం కేవలం హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిదని, ఈ రెండేళ్లలో ఒక్క ఇల్లైనా కట్టారా అని ప్రశ్నించారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని రేవంత్‌రెడ్డికి ఛాలెం జ్ చేశారు.

కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇల్లు కట్టకపోగా.. వేలాది ఇళ్లను హైడ్రా పేరుతో ఈ ప్రభుత్వం కూలగొట్టిందని ఫైరయ్యారు. మరోవైపు.. హైదరాబాద్ మెట్రో ను పూర్తి చేసింది కూడా తమ ప్రభుత్వమేనని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభు త్వం మాత్రం మెట్రో సీఎఫ్‌వో, ఎల్ అండ్ టీ సీఎఫ్‌వోలను బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బాధ తట్టుకోలేక, వాళ్ల బెదిరింపులకు తాళలేక ఎంత మంది పారిశ్రామికవే త్తలు పారిపోయారో చర్చిద్దామా అన్నారు.

విద్యుత్ కోతలపై చర్చిద్దామా..

కాంగ్రెస్ హయాంలో వారానికి రెండు, మూడు రోజులు పవర్ హాలీడేస్ ఉంటే.. తాము అధికారం చేపట్టిన తర్వాత 24 గంట లూ కరెంటు ఇచ్చామని గుర్తు చేశారు. ఎల్‌ఈడీ బల్బులతో తెలంగాణను దేదీప్యమా నంగా చేశామని.. కానీ ఈ రెండేళ్లలో రేవంత్ సర్కార్ ఒక్క ఎల్‌ఈడీ అయినా పెట్టిందా అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో విద్యు త్ వెలుగులు కొనసాగాయో.. ఎవరి హయాంలో విద్యుత్ కోతల తో ఇబ్బంది పడ్డారో చర్చిద్దామా అని సవా ల్ విసిరారు.  మీ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క నర్సరీ కూడా పెట్టకపోగా.. ఉన్న చెట్లను నరికేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10వేల కోట్లకు కక్కుర్తిపడి హెచ్‌సీయూలో జీవవైవిధ్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగాలను కూడా మూడు లక్షల నుంచి 9 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. 

ఎక్కడైనా చర్చకు ఓకే..

బీఆర్‌ఎస్ హయాంలో సీసీ కెమెరాలు పెట్టి కేసీఆర్ హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పెంపొందిస్తే.. ఇప్పుడు సైబరాబాద్‌లో 41 శాతం, హైదరాబాద్‌లో 60 శాతం క్రైమ్ రేటు పెరిగిందని వెల్లడించారు. డే లైట్ మర్డర్లు పెరిగాయని అన్నారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. దమ్ముం టే సీఎం రేవంత్ రెడ్డి గత రెండేళ్లలో కాంగ్రె స్ ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలు చెప్పి ఓట్లు అడగాలని ఛాలెంజ్ విసిరారు. దీనిపై ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి తాము సిద్ధమని సవాల్ విసిరారు. 

బీఆర్‌ఎస్ చేసిన పనుల వివరాలు..

మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్‌కు బీఆర్‌ఎస్ ఎంతెంత ఖర్చు చేసిందో వివరించారు. 2014 నుంచి 2023 వరకు ఎంత అభివృద్ధి చేశారో ఆయ న లెక్కలతో సహా వెల్లడించారు. బీఆర్‌ఎస్ పదేళ్లలో రూ.5,328 కోట్లు ఖర్చు చేసింద న్నారు. 2,12,862 మందికి లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు. ప్రజా రవాణా, రోడ్ల కోసం అంటే.. మెట్రో, రోడ్డు,ఫ్లు ఓవర్ల నిర్మాణాలకు రూ.2,463 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రూ.919 కోట్లను ప్రజారోగ్యం, టిమ్స్ ఆస్పత్రి, బస్తీ దవాఖానాల కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

కొవిడ్ వ్యాక్సిన్‌కు రూ. 13.87 కోట్లు ఖర్చు చేసి దాదాపుగా 34,712 మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద రూ.98 లక్షలు, కేసీఆర్ కిట్ కింద రూ.73 లక్షలు, కం టి వెలుగు కోసం రూ.55 లక్షలు, న్యూట్రిషన్ కిట్ల కోసం రూ.14 లక్షలు ఖర్చు చేశా మని కేటీఆర్ వివరించారు. సామాన్యుడి సొంతింటి కలను నిజం చేసేందుకూ.. గృహ నిర్మాణం కోసం రూ.324 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

సామాజిక సంక్షేమం కోసం రూ.705 కోట్లు ఖర్చు చేశామన్నారు. కల్యాణలక్ష్మికి రూ.63 కోట్లు ఖర్చు చేసి 6,320 మందికి లబ్ధి చేసినట్లు తెలిపారు. ఆసరా పించన్లకు రూ.564 కోట్లు పెట్టగా.. 25,905 లబ్ధిపొందారని స్పష్టం చేశారు. బతుకమ్మ చీరలకు రూ.45.25 కోట్లు, దళితబంధు రూ.10.6 కోట్లు, బీసీ బంధు రూ.3.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్‌లు రూ.14 కోట్లు, అన్నపూర్ణ క్యాంటీన్‌ల కోసం రూ.2 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు.

ఏ గల్లీకి వెళ్లినా శిలాఫలకం..

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.87కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.51 కోట్లు ఖర్చు చేయగా సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కోసం రూ.36 కోట్లు, శ్రీనగర్ కాలనీ, రహమత్ నగర్‌లో రెండు అంగన్‌వాడీ కేంద్రాల కు రూ.49 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. అభివృద్ధి, మౌలిక వసతులకు రూ.44 కోట్లు ఖర్చు చేశామన్నారు. మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్స్ అభివృద్ధికి రూ.17.3 కోట్లు, సీసీ కెమెరాలకు రూ.2.7 కోట్లు, ఎల్‌ఈడీ లైట్స్ నిర్వహణ కోసం రూ.5 కోట్లు, షేక్‌పేట్ గుట్టపోచమ్మ ఆలయాల నిర్మాణం కోసం రూ.80 లక్షలు, స్మశాన వాటికల ఏర్పాటుకు రూ.2.5 కోట్లు, ఇతర నిర్మాణాలు, మరమ్మతులకు రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

విద్యుత్ నిర్వహణ కోసం రూ.505 కోట్లు చేసి.. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని జనరేటర్లు లేకుండా కాంతిమయం చేసిందే బీఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు. రూ.455 కోట్లతో 10 సబ్ స్టేషన్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.50 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు రూ.180 కోట్లు ఖర్చు చేశామని, అందులో ఉచిత నల్లా కనెక్షన్‌కు ఖర్చు రూ.30 కోట్లు కాగా, బోరబండ వాటర్ రిజర్వాయర్‌కు  రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించిందే బీఆర్‌ఎస్ అని కేటీఆర్ వెల్లడించారు. ఎస్‌ఎన్‌డీపీ పనుల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పర్యావరణం, పచ్చదనం కోసం రూ.26 కోట్లు వెచ్చించామని, అందులో పార్కుల సుందరీకరణ కోసం రూ.20 కోట్లు, గులకపూర్ కాలువ, ఎర్రకుంట చెరువు అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు, విపత్తు నిర్వహణ పనులకు రూ.4.45 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు.

లై డిటెక్టర్ టెస్ట్‌కూ నేనొస్తా..

రేవంత్‌రెడ్డి, మోదీ మధ్య మంచి ఫెవికాల్ బంధం ఉందని కేటీఆర్ ఎద్దే వా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాహుల్ గాంధీ విమర్శిస్తే.. అదే సంస్థలను రేవంత్ నమ్ముతారని వెల్లడించా రు. మైనార్టీలను అవమానించినందుకు రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఫార్ములా ఈ కేసులోనూ గవర్నర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినా, చార్జ్‌షీట్‌లో విష యం లేకపోవడం వల్ల దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్నారు. తనపై చేసిన ఆరోపణల విషయంలో.. దమ్ముంటే ఈ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలని చెప్పారు. తాను లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమే అని.. రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు.  ఎవరు దొంగనో తేలిపోతుంది కదా అన్నారు. 

టీ-హబ్ స్థాపనతో స్టార్టప్ రాజధానిగా హైదరాబాద్

  1. నేను చేసిన ఇష్టమైన కార్యక్రమాల్లో టీ-హబ్ ఒకటి
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

టీ-హబ్ స్థాపనతో హైదరాబాద్ నగరం స్టార్టప్ రాజధానిగా ఎదిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. భారతదేశంలోని స్టార్టప్ ఎకోసిస్టంలో తెలంగాణ అగ్రగామిగా ఎదగడానికి టీ-హబ్ పునాది వేసిందన్నారు. టీ-హబ్ స్థాపన దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించి అభినందనలు తెలిపారు. కేసీఆర్ దూరదృష్టి గల నాయకత్వంలో తాము ఒక సమగ్రమైన ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించామని, ఇది హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్‌గా మార్చిందని పేర్కొన్నారు.

ఒక సమగ్రమైన ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో తాము చేపట్టిన విజన్‌లో టీ-హబ్ కేవలం మొదటి అడుగు మాత్రమే అని, దాని తర్వాత వీ-హబ్, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్(టీఎస్‌ఐసీ), టీ-వర్క్స్, టాస్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రీచ్) వంటి సంస్థలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇవన్నీ తెలంగాణ ఇన్నోవేషన్ వ్యవస్థను సాటిలేనిదిగా తయారు చేశాయని వెల్లడించారు. టీ-హబ్ ఏర్పాటు రోజున రతన్ టాటా ‘టీ-హబ్ ఆధునిక భారతదేశ ముఖ చిత్రంగా నిలుస్తుంది’ అని చెప్పిన మాటలను గుర్తు చేశారు. గత దశాబ్దంలో టీ-హబ్ సాధించిన విజయం ఐటీ మంత్రిగా తనకు అత్యంత గర్వించదగిన క్షణాల్లో ఒకటి అని తెలిపారు.