calender_icon.png 12 August, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కొరత వేధిస్తున్నా పట్టదా?

12-08-2025 12:00:00 AM

రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్, సీపీఎం నాయకుల నిరసన

హుస్నాబాద్, ఆగస్టు 11 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులుపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బీఆర్‌ఎస్, సీపీఎం నాయకులు నిరసనకు దిగారు. గురువారం ఆ పార్టీల నాయకులు అయిలేని మల్లికార్జునరెడ్డి, గుగులోత్ శివరాజ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతులు గ్రోమోర్ ఎరువుల దుకాణం ముందు ఆందోళన చేశారు.

వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా, వరి నాట్లు వేసిన రైతులకు సరిపడా ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు పొలాల్లో పనులు వదిలేసి, ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రైతులు వరి నాట్లకు ఎరువులు వాడతారని ప్రభుత్వానికి తెలిసినప్పటికీ, సరైన ప్రణాళిక లేకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

హుస్నాబాద్ ప్రాంతంలో ఎన్ని ఎకరాల పంటలు వేశారో, ఎంత ఎరువులు అవసరమో వ్యవసాయ శాఖ అధికారుల వద్ద సమాచారం ఉన్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా, రెండు ఎకరాలకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని, ఈ పరిమిత సరఫరా ఏమాత్రం సరిపోవడంలేదన్నారు.

అవసరం లేకున్నా పురుగుమందులను అంటగడుతున్నరు.. 

తమను మరింత ఇబ్బందికి గురిచేసేలా, ఫర్టిలైజర్ షాపుల యజమానులు యూరియాకు పురుగుమందులను జతచేసి బలవంతంగా అంటగడుతున్నారని రైతులు వాపోయారు. అవసరం లేని పురుగుమందులు కొనాల్సి రావడంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని, వెంటనే ఈ ’లింక్’ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఎరువులను బ్లాక్ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఫర్టిలైజర్ షాపుల యాజమానులపై వ్యవసాయ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే చొరవ తీసుకొని హుస్నాబాద్ ప్రాంతానికి ఎరువుల కొరత లేకుండా చూడాలని మల్లికార్జునరెడ్డి కోరారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని  హెచ్చరించారు.