06-07-2025 01:21:26 AM
- తమ దేశంలో లేడన్న పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో
- భారత్ సమాచారమిస్తే అరెస్టు చేస్తామన్న మాజీ మంత్రి
- హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడన్న వార్తలు అవాస్తవం
న్యూఢిల్లీ, జూలై 5: జైషే మహ్మద్ అధినేత, ఉగ్రవాది మసూద్ అజార్ బహుశా అఫ్గానిస్తాన్‌లో ఉన్నాడేమో పాకిస్థాన్‌లో మాత్రం లేడు అని పాక్ విదేశాంగశాఖ మాజీ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో వ్యాఖ్యా నించారు. ఆయన ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయ డం గమనార్హం.
‘హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. అతడు పాక్ కస్టడీలోనే ఉన్నాడు. మసూద్ అజార్ విషయానికొస్తే.. అతడు ఎక్కడ ఉన్నారో మేం గుర్తించలేకపోతున్నాం. గతంలో జరిగిన కొన్ని ఘటనలను బట్టి అతడు అఫ్గానిస్తాన్‌లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అతడు పాక్‌లోనే ఉన్నాడని భారత ప్రభుత్వం కచ్చితమైన సమాచారం ఇస్తే.. సంతోషంగా అరెస్టు చేస్తాం.’ అంటూ భుట్టో పేర్కొన్నారు.