03-08-2025 12:39:07 AM
- నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు
- సీఎస్‌కు టీచర్ ఎమ్మెల్సీ కొమురయ్య లేఖ
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూడు జిల్లాల డీఈవో బాధ్యతలను ఐఏఎస్ అధికారులకు అప్పగించడాన్ని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. ఈమేరకు సీఎస్‌కు శనివారం ఆయన లేఖ రాశారు. జిల్లా విద్యాశాఖ అధికారుల అదనపు బాధ్యతల నియామకాల్లో నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ఐఏఎస్‌లకు డీఈవో అదనపు బాధ్యలను ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
సేవా నియమావళుల ప్రకారం డీఈవో లేదా డిప్యూటీ ఈవో పదవులకు కనీస అర్హత గా సాధారణ డిగ్రీతోపాటు బీఎడ్ ఉండాలని, కానీ ఇటీవల బీఎడ్ అర్హతలులేని అధికారులకు ముఖ్యంగా ఐఏఎస్ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు విరుద్ధంగా ఉండడమే కాకుండా వారి విలువ, ప్రతిష్ఠను తక్కువచేయడమే అని పేర్కొన్నారు.
విద్యా రంగంలో నైపుణ్యాలు, విద్యాపరమైన అనుభవం అవసరమైనచోట ఇలా పరిపాల నా కోణంతో తీసుకునే నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. రాష్ర్ట ప్రభుత్వం ఈ అంశాన్ని పునఃసమీక్షించి నిబంధనలకు అనుగుణంగా, విద్యా రంగానికి తగిన అర్హతలు, అనుభవం కలిగినవారికి మాత్రమే బాధ్యతలు అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.