03-08-2025 05:11:46 PM
చండూరు,(విజయక్రాంతి): రాబోయే కాలంలో మునుగోడులో పేద ప్రజల కోసం కంటి ఆసుపత్రిని నిర్మిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరవ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గం లో పేదలకు కంటి సమస్య అనేది ఉండకుండా చూస్తామని ఆయన అన్నారు. డబ్బుల కోసం కాంట్రాక్టర్ల కోసం నిర్మించింది కాలేశ్వరం అని, గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు. గొర్రెల స్కామ్, లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా, భూమాఫియాలకు పాల్పడినవారిని ఎంతటి వారినైనా శిక్షించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.
కాలేశ్వరంలో డిజైన్ లోపం, అశ్రద్ధ నిర్లక్ష్యం వలన అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. కంటి వైద్య శిబిరం అనేది రాజకీయాలతో సంబంధం లేదని, ప్రతి నిరుపేద కంటి సమస్యలతో బాధపడకూడదని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొరిమి ఓంకారం, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు,చండూర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కావలి ఆంజనేయులు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ గంట సత్యం, మాజీ జెడ్పిటిసి మాధగోని విజయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ పల్లె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.